Kalvakuntla Kavitha : బతుకమ్మ వేడుకలపై మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈసారి ఆమె బతుకమ్మ వేడుకలను ఎక్కడినుండి ప్రారంభించనున్నారో తెలుసా? 

Kalvakuntla Kavitha : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే తండ్రి స్థాపించి, సోదరుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నడిపిస్తున్న భారత రాష్ట్ర సమితికి ఆమె రాజీనామా చేశారు... ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకున్నారు. ఇలా కుటుంబ పార్టీకి కవిత దూరమైన వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజీనామా తర్వాత ఆమె ఎలాంటి స్టెప్ తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన బతుకమ్మ పండగతోనే తన రాజకీయ వ్యూహాలను ముందుకు తీసుకెళుతున్నారు కవిత.

శనివారం హైదారాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బతుకమ్మ సంబరాలపై కవిత ఆసక్తికర కామెంట్స్ చేశారు. గత సంవత్సరం రాజకీయ కారణాలతో బతుకమ్మను జరుపుకోలేకపోయాను... ఈసారి ఘనంగా జరుపుకుంటామని అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని.. ఇందులో తాను పాల్గొంటానని తెలిపారు. తాను పుట్టిపెరిగిన చింతమడకలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు.. అందులో తాను పాల్గొంటానని కవిత తెలిపారు. తాను చింతమడకకు వెళ్లడాన్ని రాజకీయ కోణంలో చూస్తారని తెలుసు... కానీ సొంతూరు నుండి ఆహ్వానం వచ్చింది కాబట్టి వెళ్ళక తప్పదన్నారు.

గత ప్రభుత్వం దసరాకు బతుకమ్మ పేరుతో చీరలు ఇచ్చింది... కానీ ఈ ప్రభుత్వం గతేడాది చీరలు ఇవ్వలేదన్నారు కవిత. సీఎం అయితే ఒకటి కాదు రెండు బతుకమ్మ చీరలు ఇస్తానని రేవంత్ రెడ్డి అన్నారు... ఏమయ్యాయి రెండుచీరలు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ పేరు పెట్టాలని చూస్తోందని... అలా చేయరాదని సూచించారు. బతుకమ్మ పేరునే కొనసాగించాలి... లేకపోతే తెలంగాణ ఆడబిడ్డ పేరు పెట్టాలన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారని... ఇప్పుడు దశలవారీగా పేర్లు మారుస్తూ తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తున్నారని కవిత ఆరోపించారు.

కొత్త పార్టీపై కవిత రియాక్షన్ ఇదే :

బిఆర్ఎస్ కు దూరమైన కవిత బిసి నినాదంతో కొత్త రాజకీయ పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా కవిత స్పందించారు. కొత్త పార్టీపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటూనే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టే ముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారన్నారు. తాను కూడా అలాగే అందరి అభిప్రాయాలను సేకరించాకే ముందుకు వెళతానని కవిత తెలిపారు. ఆమె మాటలను బట్టి కొత్త పార్టీ పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.

ఇక కవిత కాంగ్రెస్లో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంపైనా స్పందించారు. అలాంటి ఆలోచనేది తనకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనకు ఫోన్ చేయలేదు... తానుకూడా ఎవరినీ కలవలేదు అని కవిత వెల్లడించారు.

కన్నతండ్రి స్థాపించిన పార్టీ నుంచి సస్పెండైన మొదటి కూతుర్ని తానే అని కవిత అన్నారు. ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ను అలర్ట్ చేశానని ఆమె తెలిపారు. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్దేనని హరీష్రావు పీసీ ఘోష్ కమిషన్కు చెప్పారని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావుపై తనకు వ్యక్తిగత కోపమేమీ లేదని... తన తండ్రిని ఇరకాటంలో పెట్టేలా కాళేశ్వరం విషయంలో వ్యవహరించడమే తన కోపానికి కారణమన్నారు.

సీఎం రేవంత్ పైనా కవిత సెటైర్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా కవిత సెటైర్లు వేశారు. ఇటీవల తాను బిఆర్ఎస్ కు రాజీనామా చేయడంగురించి సీఎం స్పందించారట... ఆయన ఏమన్నారో తనకు తెలియదుగానీ ముఖ్యమంత్రే కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నాడేమో అని అనిపిస్తోందన్నారు. కేవలం ఓ వర్గం కోసమో, కొంతమంది కోసమో కాదు... ప్రజలందరి కోసం పని చేయాలనుకుంటున్నానని కవిత అన్నారు. బిసి సమస్య తన మనసుకు దగ్గరైంది.. అందుకే దీనిపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. 

తనను ఎవరైనా కలవొచ్చు... ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన చాలామంది తనతో టచ్ లో ఉన్నారని... ఆ లిస్ట్ చాలా పెద్దదంటూ చివర్లో తండ్రి, సోదరుడికి షాక్ ఇచ్చారు కల్వకుంట్ల కవిత.