నేడు ప్రపంచ మాతృ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తమ మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ.... తమ జీవితంలోని మధుర క్షణాలను వారితో పంచుకుంటున్నారు. 

నేడు ఈ మాతృదినోత్సవం నాడు కేసీఆర్ కూతురు కవిత తన తల్లికి శుభాకాంక్షలు తెలుపుతూ హృదయానికి హత్తుకుపోయే ఒక వాక్యాన్ని జతచేసారు. ప్రపంచానికి ఈవిడ నాతల్లి కానీ... నాకు మాత్రం ఈవిడే ప్రపంచం అని ఎమోషనల్ గా తన మాతృమూర్తితో ఉన్న బంధాన్ని బయటపెట్టారు. 

మాతృమూర్తులను గౌరవించడానికి, మాతృత్వాన్ని గౌరవించడానికి, సమాజం మీద తల్లుల ప్రభావాన్ని గుర్తించి గౌరవించడానికి మే నెలలోని రెండవ ఆదివారాన్ని మాతృ దినోత్సవంగా ప్రపంచంలోని అత్యధిక దేశాల్లో జరుపుకుంటారు. (మరికొన్ని దేశాలు వేరే రోజుల్లో జరుపుకుంటాయి)

ఇకపోతే... ఈ మాతృ దినోత్సవం నాడు గల్ఫ్ లో చిక్కుకున్న తెలంగాణ బిడ్డలు మాతృభూమిని చేరుకున్నారు. వారిని కువైట్ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకువచ్చారు. 

కువైట్‌‌ లో చిక్కుకు పోయిన 167 మంది తెలంగాణ వాసులతో బయల్దేరిన ప్రత్యేక విమానం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిన్న రాత్రి చేరుకుంది. ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం వారిని క్వారంటైన్‌ కు తరలించారు.

ప్రయాణికుల కోసం హోటళ్లు, రిసార్టులో  ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రయాణికులను గచ్చిబౌలిలోని ఒక హోటల్ కి‌, కాచిగూడలోని హర్ష హోటల్‌కు తరలించారు. విదేశాల నుంచి వచ్చేవారి  కోసం హైదరాబాద్‌లోని 29 హోటళ్లలో  పెయిడ్‌ క్వారంటైన్‌ కోసం ఏర్పాట్లు చేశారు. 

ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో 14 రోజులకు రూ.35వేలు, త్రీస్థార్‌ హోటళ్లలో రూ.15వేలు, సాధారణ హోటళ్లలో రూ.5వేలు ఫీజు నిర్ణయించారు. పేద కార్మికులకు ఉచితంగానే ప్రభుత్వం క్వారంటైన్ ఏర్పాట్లను చేయనుంది.  

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్‌ లో భాగంగా తెలంగాణ వాసులను స్వస్థలాలకు తరలించారు. ఇకపోతే.... తెలంగాణపై మరోసారి కరోనా పంజా విసిరింది. గత కొద్దిరోజులుగా చాలా తక్కువ కేసులు నమోదవుతుంటే ఈ మహమ్మారి బారినుండి తెలంగాణ మెల్లిగా బయటపడుతుందని అందరూ భావించారు. కానీ ఇంకా తెలంగాణ రాష్ట్రం కరోనా నుండి బయటపడలేదు. ఇవాళ(శనివారం) ఒక్కరోజే తెలంగాణలో 31పాజిటివ్ కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ గణాంకాలు మరోసారి తెలంగాణలో కలకలాన్ని సృష్టించింది.