వరంగల్: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం అభ్యర్థిగా రాజయ్యను తప్పించాలని డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వర్గం చేసిన ప్రయత్నం ఫలించలేదు. కడియం శ్రీహరి కూడా రాజయ్య అభ్యర్థిత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 

రాజయ్యను తప్పించడానికి అధినేత కె. చంద్రశేఖర రావు అంగీకరించకపోవడంతో కడియం శ్రీహరి రాజీకి వచ్చారు. అయితే, రాజయ్యకు చురకలు అంటించడం మాత్రం మానలేదు.

స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన రాజయ్యకు చురకలు అంటించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో అసమ్మతి లేదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తాను, రాజయ్య కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. 

తాను అలక వహించి నియోజకవర్గానికి రావడంలేదని అనుకోవద్దని, రాజయ్య తన పట్ల అప్పుడప్పుడు తప్పుగా ప్రవర్తించినా తాను ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని కడియం శ్రీహరి చురకలు అంటించారు. 

రాజయ్య తన తమ్ముడని, రాజయ్య టీఆర్ఎస్ పార్టీలో ఓ ముఖ్య నాయకుడని, రాజయ్యను తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని అన్నారు.