నేను వద్దని అనుకున్నాను.. దేవుడు కూడా.. అందుకే సచివాలయం కాలిపోయింది: కేఏ పాల్
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాణంలో ఉన్న సచివాలయం చూసేందుకు తాను వెళ్తానంటే అడ్డుకున్నారని అన్నారు.

తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాణంలో ఉన్న సచివాలయం చూసేందుకు తాను వెళ్తానంటే అడ్డుకున్నారని అన్నారు. తాను వద్దనాన్నని.. దేవుడు కూడా వద్దని అనుకున్నాడని.. అందుకే సచివాలయం కాలిపోయిందని చెప్పుకొచ్చారు. తనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని చెప్పారు. దేవుడు కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నాడని అన్నారు. దేవుడికి నచ్చకనే సెక్రటేరియట్‌కు వ్యతిరేకంగా నిలబడ్డాడని కామెంట్ చేశారు.
కేసీఆర్ అవినీతి ఎంతో కాలం చెల్లదని.. ఇప్పటికైనా పశ్చాత్తాపడి మారాలని అన్నారు. కేసీఆర్ ఈసారి ముఖ్యమంత్రిగా గెలవలేరని విమర్శించారు. అలాంటి వ్యక్తి ప్రధాని అవుతారా? అని ఎద్దేవా చేశారు. అంబేడ్కర్ జయంతి రోజే కొత్త సచివాలయం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పేరు ఒకరిది.. పండుగ మరొకరిదా అంటూ సెటైర్లు వేశారు. అమరవీరుల స్తూపం దగ్గరకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారని.. తనను తెలంగాణాలో బ్యాన్ చేద్దామని అనుకుంటున్నారా? అని మండిపడ్డారు.
Also Read: కొత్త సచివాలయానికి వెళ్లేందుకు యత్నం.. షబ్బీర్ అలీ, మల్లు రవి అరెస్ట్.. గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత..
ఇదిలా ఉంటే.. ఇక, తెలంగాణ నూతన సెక్రటేరియట్‌ను ఈ నెల 17న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారవర్గాలు తెలిపాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు ఏమిటనేది స్పష్టంగా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. 11 అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.