మాజీ సీఎం కేసీఆర్ తన బర్త్ డేకు గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. తెలంగాణ భవన్‌లో పలువురు పార్టీ నాయకులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత వచ్చే నెలలో గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు వెళ్లనున్నట్టు తెలిసింది. 

BRS Party: భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తుంటి ఎముక గాయం నుంచి కోలుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ఇది వరకు ప్రజల ముందుకు రాలేదు. ఈ గాయం నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ఆయన బర్త్ డే రోజున ప్రజా జీవితంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన ఆయన తెలంగాణ భవన్‌కు విచ్చేయనున్నారు. ఆయన బర్త్ డే వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ప్లాన్ చేస్తున్నాయి. రాజధాని నగరంలో భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, ర్యాలీలతో కార్యకర్తల్లో జోష్ నింపడానికి ప్రణాళికలు ఉన్నాయి.

ఆ తర్వాత కూడా కేసీఆర్ ఎక్కువ సమయం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలవడానికి, సమావేశం కావడానికి కేటాయించనున్నారు. వచ్చే నెల 20 తర్వాత ఆయన గజ్వేల్‌కు వెళ్లుతారని తెలిసింది. ఆ తర్వాత రెగ్యులర్‌గా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది. తొలి పర్యటనలో ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపి.. నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించే అవకాశం ఉన్నది.

Also Read : Priyanka Gandhi: దక్షిణాది నుంచి రెండు స్థానాల్లో ప్రియాంక గాంధీ పోటీ !.. ఇప్పటికే సర్వేలు పూర్తి?

లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వరుస కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. కేసీఆర్ తన పాత మిత్రులు, ఉద్యమ సహచరులను మళ్లీ కాంటాక్ట్‌లోకి తెచ్చుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే కేటీఆర్, హరీశ్ రావులు లోక్ సభ సన్నాహక సమావేశాలు జరుపుతున్నారు. ఈ నెల 22వ తేదీతో ఈ సమావేశాలు ముగుస్తున్నాయి. అనంతరం, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలోనూ ఇలాంటి సమావేశాలకు ప్లాన్ వేస్తున్నారు.

వరంగల్‌లో ఓ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు కథనాలు వచ్చాయి. ఎన్నికల సమయంలోనూ ఇక్కడ ఓ సభ నిర్వహించాలని ప్రయత్నించారు. కానీ, కార్యరూపం దాల్చలేదు. దీంతో ఇప్పుడు అక్కడ బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తున్నట్టు సమాచారం. వరుస కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో జోష్ తేనున్నారు.