Asianet News TeluguAsianet News Telugu

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎవరేమన్నారంటే...

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు రోడ్డుపైకి వచ్చి తమ హర్షాన్ని తెలియజేస్తున్నారు. 

Justice Served: Politicians, Filmstars comments on disha case accused encounter
Author
Hyderabad, First Published Dec 6, 2019, 3:00 PM IST

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు రోడ్డుపైకి వచ్చి తమ హర్షాన్ని తెలియజేస్తున్నారు.

నిర్భయ విషయంలో ఆలస్యమైందని.. కానీ దిశకు  మాత్రం సత్వరంగానే న్యాయం జరిగిందని వారు చెబుతున్నారు. ఈ మేరకు సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ ప్రముఖులు తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎవరెవరు ఏ విధంగా స్పందించారో ఒకసారి చూస్తే..

ఆశా దేవి: నిర్భయ తల్లీ

దిశ హత్యాచార నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడాన్ని నిర్భయ తల్లీ ఆశా దేవి స్వాగతించారు. హైదరాబాద్ పోలీసులు గొప్ప విధి నిర్వహించారని, ఇదే సమయంలో పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆమె ప్రభుత్వానికి తెలియజేశారు. తన బిడ్డ విషయంలో ఏడేళ్ల నుంచి న్యాయం కోసం పోరాడుతున్నామని.. నిర్భయ నిందితులను త్వరగా ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. 

మాయావతి, బీఎస్పీ అధినేత్రి 

దిశా హత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి సమర్ధించారు. ఇదే సమయంలో యూపీ పోలీసులు.. హైదరాబాద్ పోలీసులను చూసి బుద్ధి తెచ్చుకోవాలని ఆమె దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్‌లో దురదృష్టవశాత్తూ నేరగాళ్లను అతిథులుగా చూస్తున్నారని.. ప్రస్తుతం అక్కడ జంగల్ రాజ్ కొనసాగుతోందని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రేఖా శర్మ, జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలు 

అత్యాచార నిందితులను పోలీసులు కాల్చి చంపడాన్ని సామాన్య పౌరురాలిగా తనకు ఆనందంగా ఉందన్నారు జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలు రేఖా శర్మ.  భారతదేశ న్యాయవ్యవస్థ సూచించిన విధంగా నడుచుకుని ఉంటే బాగుండేదని రేఖ అభిప్రాయపడ్డారు. 

దిశ తండ్రి 

పోలీసుల చర్యతో తన బిడ్డ ఆత్మకు నిజమైన శాంతి చేకూరుతుందన్నారు దిశ తండ్రి. తాము ఫిర్యాదు చేసినప్పుడు పట్టించుకోని పోలీసులు, ఇప్పుడు మాత్రం సరిగ్గా స్పందించారని ఆయన వెల్లడించారు. దిశను కిరాతకంగా చంపేసిన మృగాళ్లను ఎన్‌కౌంటర్‌ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. 

జయహో తెలంగాణ పోలీస్ 

దిశ హత్యాచార నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన వార్త తెలుసుకున్న షాద్‌నగర్ పరిసర ప్రాంత ప్రజలు భారీగా చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. బ్రిడ్జి పై నుంచి ఎన్‌కౌంటర్ స్పాట్‌లో ఉన్న పోలీసులపై పూల వర్షం కురిపించారు. అంతేకాకుండా తెలంగాణ పోలీస్ జిందాబాద్.. సాహో సజ్జనార్ అంటూ నినాదాలు చేశారు. 

పోలీసులకు మిఠాయిలు 

దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దిశ కుటుంబసభ్యులు నివసించే కాలనీ వాసులు పోలీసులకు మిఠాయిలు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు.

జయాబచ్చన్, ఎంపీ

దిశ హత్యాచార నిందితులను తెలంగాణ పోలీసులు కాల్చిచంపడంపై ఎంపీ జయాబచ్చన్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘బహుత్ డేర్ ఆయా.. దురస్త్ అయే.. డేర్ అయే.. బహుత్ డేర్ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. నలుగురు కామాంధులకు సరైన శిక్ష వేశారని.. పోలీసులు తీసుకున్న నిర్ణయం ఎంతో ధైర్యవంతమైనదన్నారు. 

 

భూపేశ్ భగేల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి 

నేరస్థులు పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులకు ఎన్‌కౌంటర్ చేయడం కంటే మరో అవకాశం ఉండదన్నారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్

అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి

షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌పై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విభిన్నంగా స్పందించారు. పోలీసుల చర్యను దేశ ప్రజలు సంబరంగా జరుపుకుంటున్నారని.. అయితే ఇది కూడా చింతించాల్సిన విషయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్‌కౌంటర్‌పై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు దేశ న్యాయవ్యవస్థను విశ్వసించడం లేదని, న్యాయవ్యవస్ధ పట్ల ప్రజలకు గౌరవం కలిగించే మార్గాలను అన్వేషించాలని కేజ్రీవాల్ సూచించారు. 

మేనకా గాంధీ, బీజేపీ ఎంపీ

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై బీజేపీ ఎంపీ మేనకా గాంధీ తప్పుబట్టారు. శుక్రవారం ఉదయం జరిగిన ఘటన చాలా భయంకరమైనదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని, ఏదేమైనా కోర్టులో చూసుకోవాల్సిందన్నారు. ఇష్టం వచ్చిన ఎన్‌కౌంటర్లు చేస్తే కోర్టులు, పోలీసులు, చట్టాలు ఎందుకున్నట్లని మేనకా మండిపడ్డారు.

బాబా రాందేవ్, ప్రముఖ యోగాగురు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రముఖ యోగాగురు స్పందించారు. తెలంగాణ పోలీసులు చర్యను సాహోసోపేతమైనదన్న ఆయన... దిశకు న్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు. న్యాయపరమైన అంశాలను పక్కనబెడితే, భారతీయులు మాత్రం ఖచ్చితంగా ఊపిరి పీల్చుకున్నారని రామ్‌దేవ్ తెలిపారు.

 రఘురామ కృష్ణంరాజు, వైసీపీ ఎంపీ

తెలంగాణ ఎన్‌కౌంటర్‌పై వైసీసీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. వారు కాల్చి చంపడానికి అర్హులని, నేరస్థులకు ఇది మంచి గుణపాఠమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఏ ఎన్జీవో కూడా పోలీసుల చర్యను తప్పుబట్టకూడదని అలా గనుక చేస్తే వారు దేశ వ్యతిరేకులేనని రఘురామ కృష్ణంరాజు స్పష్టం పెట్టారు.

నవనీత్ కౌర్, ఎంపీ

ఒక తల్లీగా, కుమార్తెగా, భార్యగా తెలంగాణ పోలీసుల చర్యను తాను సమర్థిస్తున్నట్లు తెలిపారు ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్. 

పి. చిదంబరం, కాంగ్రెస్ ఎంపీ

తెలంగాణ ఎన్‌కౌంటర్‌ ఘటనలో ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలియదని.. అయితే బాధ్యతగల వ్యక్తిగా, తాను చెప్పేదేంటి అంటే ఇది పూర్తిగా విచారించబడాలని డిమాండ్ చేశారు. ఇది నిజమైన ఎన్‌కౌంటర్ అవునా, కాదా అన్నది తేల్చాలని చిదంబరం సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios