Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ హైకోర్టు తొలి మహిళా సీజేగా జస్టిస్‌ హిమా కోహ్లి

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ హిమా కోహ్లి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌ హైకోర్టు సీజేగా బదిలీపై వెళ్తున్నారు. 

Justice Hima Kohli appointed as Chief Justice of Telangana High Court - bsb
Author
Hyderabad, First Published Jan 1, 2021, 11:22 AM IST

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ హిమా కోహ్లి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌ హైకోర్టు సీజేగా బదిలీపై వెళ్తున్నారు. 

గత 15 రోజుల క్రితం సుప్రీంకోర్టు కొలిజీయం వీరి బదిలీలను కేంద్రానికి సిఫార్సు చేయగా.. రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆమోదించడంతో అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లి విధులు నిర్వహిస్తున్నారు. 

ఆమె 1959 సెప్టెంబర్‌ 2న ఢిల్లీలో జన్మించారు. ప్రాథమిక విద్యను సెయింట్‌ థామస్‌ పాఠశాలలో, ఉన్నత విద్యాభ్యాసాన్ని సెయింట్‌ స్టీఫెన్‌ కళాశాలలో పూర్తి చేశారు. న్యాయవిద్యను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేశారు. ఢిల్లీ బార్‌కౌన్సిల్‌లో 1984లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 

1999–2004 మధ్య ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు న్యాయసలహాదారుగా, హైకోర్టులో స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలు అందించారు. అనేక ప్రజాహిత వ్యాజ్యాల్లో ఢిల్లీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలితోపాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థల తరఫున వాదించారు.  

2006 మే 29న ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా హిమా కోహ్లి నియమితులయ్యారు. 2007 ఆగస్టు 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ రాష్ట్ర న్యాయసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌గా, నేషనల్‌ లా యూనివర్సిటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా, పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జ్యుడీషియల్‌ సెన్సెస్‌ జనరల్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా, జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో వస్తున్న న్యాయదీప్‌ పత్రిక సంపాదక వర్గ సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు. 

కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను జస్టిస్‌ కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ధర్మాసనం ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీచేసింది.  

Follow Us:
Download App:
  • android
  • ios