తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాజాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ బహిషృత నేతలు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతున్న సంగత తెలిసిందే. ఈ క్రమంలోనే జూపల్లి కృష్ణారావు పలువురు కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత జగదీశ్వరరావులతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిక, రాష్ట్రంలోని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని తాజా రాజకీయ అంశాలపై వారితో చర్చించినట్టుగా తెలుస్తోంది. రెండు గంటలకు పైగా ఈ సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్‌లో చేరితే.. కొల్లాపూర్ పార్టీ కోసం ఇంతకాలం పనిచేసి టికెట్ ఆశిస్తున్న నేతలతో కలిసి ముందుకు సాగాలనే భావనలో జూపల్లి కృష్ణారావు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, తాను ఏ పార్టీలో చేరేది జూన్‌లో ప్రకటించనున్నట్టుగా జూపల్లి ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జూపల్లి కాంగ్రెస్‌ నేతలతో సమావేశం కావడంతో.. ఆయన త్వరలోనే హస్తం గూటికి చేరనున్నారనే ప్రచారం మరింత జోరందుకుంది.

ఇక, కాంగ్రెస్‌లో పొంగులేటి, జూపల్లి కృష్ణారావుల చేరికకు ఆ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరువురు నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరికకు సంబంధించి వారి వారి క్యాడర్‌కు సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 20న లేదా 25న పొంగులేటి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ అగ్రనేతల సమక్షంలో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో ఇరువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. అయితే ఖమ్మం సభకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.