హైదరాబాద్ గచ్చిబౌలిలో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో (Gachibowli) శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతివేగంగా కారు అదుపుతప్పి ఫుట్‌పాత్ మీదకు దూసుకెళ్లగా.. అక్కడ చెట్లకు నీళ్లు పడుతున్న మహేశ్వరమ్మ(38) మృతిచెందింది. ఆ సమయంలో కారులో ప్రయాణిస్తున్న రోహిత్, గాయత్రిలను చికిత్స నిమిత్తం ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. అయితే రోహిత్ ప్రస్తుతం చికిత్స పొందుతుంగా.. జూనియర్ ఆర్ఠిస్ట్‌గా పనిచేస్తున్న గాయత్రి చికిత్స పొందుతూ మృతిచెందింది. అయితే కారు ప్రమాదం జరిగిన సమయంలో గాయత్రి కారు నడిపినట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రికి, రోహిత్‌కు గతకొంతకాలంగా పరిచయం ఉందని పోలీసులు గుర్తించారు. గాయత్రి ఇంటి వద్దకు వెళ్లి పికప్ చేసుకున్న రోహిత్.. హోలీ సందర్భంగా పార్టీ చేసుకునేందుకు ప్రిజం పబ్‌కి వెళ్లారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో రోహిత్ మద్యం మత్తులో డ్రైవ్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. రోహిత్ పూర్తిగా కారుపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో ఎల్లా హోటల్ సమీపంలో మొక్కలకు నీళ్లు పోస్తున్న మహేశ్వరమ్మ మృతిచెందింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన గాయత్రి కూడా మరణించింది. ఇక, గాయత్రి కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటుండగా.. రోహిత్ హెచ్‌ఎంటీ హిల్స్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇక, ఈ కేసులో పోలీసులు తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
ఇక, ఇటీవలి కాలంలో హైదరాబాదులో విచక్షణారహితమైన కారు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదాల్లో నిరక్ష్యంగా వాహనాలు నడుపుతున్నవారే కాకుండా.. రోడ్డు మీద వెళ్తున్న అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడింగ్‌కు సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ.. ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉండటం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది.
