బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డాకు తెలంగాణ బీజేపీ నేతలు స్వాగతం పలికారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డాకు తెలంగాణ బీజేపీ నేతలు స్వాగతం పలికారు. హైదరాబాద్‌కు చేరుకున్న జేపీ నడ్డా.. తొలుత కాసేపు హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్, ప్రముఖ కొరియోగ్రాఫర్, పద్మశ్రీ గ్రహీత ఆనంద శంకర్‌లను కలవనున్నారు. టోలిచౌకిలోని ప్రొఫెసర్ కె నాగేశ్వర్, ఫిల్మ్ నగర్‌లోని ఆనంద శంకర్‌ల నివాసాలకు జేపీ నడ్డా స్వయంగా వెళ్లనున్నారు. తర్వాత తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో జేపీ నడ్డా సమావేశం కానున్నారు.
అనంతరం జేపీ నడ్డా.. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటారు. జేమహాజన సంపర్క్ అభియాన్‌లో భాగంగా నాగర్ కర్నూలులో జరిగే నవ సంకల్ప సభలో ఆయన పాల్గొననున్నారు. దాదాపు గంటసేపు జేపీ నడ్డా.. నాగర్‌కర్నూలులో జరిగే నవ సంకల్ప సభలో ఉండనున్నారు. అనంతరం తిరిగి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు చేరుకుంటారు. రాత్రి 7.40 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి కేరళ రాజధాని తిరువనంతపురంకు వెళ్లనున్నారు.
ఇక, టీ బీజేపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జేపీ నడ్డా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ రాష్ట్ర నాయకత్వ తీరుపై అసంతృప్తితో ఉన్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు.. అధిష్టానంతో చర్చలు జరిపేందుకు శనివారం ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలోనే వారు జేపీ నడ్డా, అమిత్ షాలను కలిసి చర్చలు జరిపారు. అయితే ప్రస్తుతం వారు ఢిల్లీలోనే ఉండటంతో.. జేపీ నడ్డా పర్యటనకు దూరంగా ఉండిపోయారు.
