Asianet News TeluguAsianet News Telugu

టిఆర్ఎస్ సర్కారుకు మరో పెద్ద షాక్

  • పోలీసుల వాదనను కొట్టిపారేసిన న్యాయస్థానం
  • అడిగిన 48 గంటల్లోనే కొట్లాట సభకు అనుమతించాలి
  • ఆ మూడూ రోజుల్లో తప్ప ఎప్పుడు  అడిగినా ఇవ్వాలి
  • సర్కారు నిరంకుశత్వం ఓడిపోయిందన్న కోదండరాం
  • నిరుద్యోగుల పోరాటం ద్వారా న్యాయం గెలిచిందని కామెంట్
jolt to KCR sarkar high court permits kodandaram koluvulakai kotlata expect on two dates

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో భారీ షాక్ తగిలింది. కొలువుల కొట్లాట సభకు అనమతి ఇవ్వడంలో పోలీసుల తీరును హైకోర్టు తప్పుపట్టింది. నవంబరు 30, డిసెంబరు1, డిసెంబరు 6వ తేదీల్లో తప్ప జెఎసి ఏరోజు అనుమతి అడిగినా ఇవ్వాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. జెఎసి ప్రతినిధులు అనుమతి అడిగిన 48 గంటల్లోనే వారరికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది న్యాయస్థానం.

కొలువుల కొట్లాట సభకు గత కొంతకాలంగా అడుగడుగునా తెలంగాణ పోలీసులు, ప్రభుత్వం అడ్డంపడుతూ వస్తున్నారు. రకరకాల కారణాలు, కుంటిసాకులు చూపుతూ జెఎసి కొట్లాట సభను జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో తెలంగాణ జెఎసి విషయాన్ని హైకోర్టు వద్దకు తీసుకుపోయింది. ఈనేపథ్యంలో హైకోర్టు తీవ్రమైన రీతిలో సర్కారుకు తలంటిపోసింది. కొట్లాట సభ జరుపుకోవడానికి తెలంగాణ పోలీసులు చూపిస్తున్న కారణాలేవీ కూడా సహేతుకంగా లేవని కోర్టు తేల్చిపారేసింది. పోలీసులు కోర్టులో చేసిన వాదనలను కొట్టిపారేసింది. 30వ తేదీన సభ జరుపుకోవడానికి ఎల్ బి నగర్ డిసిపి అనుమతి నిరాకరించడాన్ని కోర్టు కొట్టేసింది. పోలీసులు చూపిన కారణాలేవీ సహేతుకంగా లేవని వెల్లడించింది. కేసును నవంబరు 30వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. 

తెలంగాణ పోలీసుల వాదన హైకోర్టులో నెగ్గలేదు... దీంతో ఇది నిరుద్యోగులు సాధించిన విజయం అని తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం ప్రకటించారు. నిరుద్యోగుల పోరాటం ఫలితంగా న్యాయం గెలిచిందన్నారు. తెలంగాణ సర్కారు నిరంకుశం ఓడిపోయిందని కోదండరాం వ్యాఖ్యానించారు.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం జెఎసి సమావేశం కానుంది. నవంబరు 30న ఇవాంక పర్యటన నేపథ్యంలో ఆ తేదీల్లో సభకు అనుమతి రాలేదు. దాంతోపాటు డిసెంబరు 1వ తేదీ, డిసెంబరు 6వ తేదీన కాకుండా ఏరోజు అడిగినా వారికి 48 గంటల్లో అనుమతి ఇవ్వాలని కోర్టు పోలీసు బాస్ లను ఆదేశించిన నేపథ్యంలో మరో తేదీని జెఎసి ఖరారు చేయనుంది. డిసెంబరు 6వ తేదీన బాబ్రీమసీదు విధ్వంసం (బ్లాక్ డే) కారణంగా ఆరోజున కొట్లాట సభ జరపరాదని కోర్టు ఆదేశించింది.

మొత్తానికి ఇంతకాలంగా తెలంగాణ జెఎసి ని ఇబ్బందులపాలు చేస్తున్న సర్కారుకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చిందని జెఎసి నేత ఒకరు ఏషియానెట్ కు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది చెంపపెట్టు లాంటి నిర్ణయం అని తెలిపారు. అడిగిన 48 గంటల్లో పోలీసులు అనుమతి ఇవ్వకపోతే మళ్లీ న్యాయస్థానం తలపు తట్టడంలో వెనకాడబోమన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios