మునుగోడు ఉప ఎన్నిక : బీజేపీ స్టార్ క్యాంపెనర్లలో జీవితా రాజశేఖర్..
మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారానికి జీవితారాజశేఖర్ తో సహా 40మంది స్టార్ క్యాంపెయినర్లను బీజేపీ బరిలోకి దించనుంది. ఈ మేరకు ఓ జాబితా విడుదల చేసింది.
హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు రసవత్తరంగా మారింది. ఈ క్రమంలోనే పార్టీలన్నీ తామే నెగ్గాలన్న పంతంతో ఉన్నాయి. ఇక బీజేపీ ఈ ఎన్నికల్లో తమ తరఫున స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతోంది. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికకు సినీ నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్‌తో సహా 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కుమార్, రాజ్యసభ ఎంపీ కే లక్ష్మణ్, కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి డీకే అరుణ, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌లు తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్, కో-ఇంఛార్జి అరవింద్ మీనన్, నిజామాబాద్ ఎంపీ డి.అరవింద్, నటుడిగా మారిన రాజకీయ నాయకుడు బాబు మోహన్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, ఎం. రఘునందన్ రావు, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి.
అదే సమయంలో తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సాల్ కీలక ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్‌మెంట్ బృందాలతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పథకాలతో టీఆర్‌ఎస్ తన సొంత పథకాలు అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కోవడంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని పార్టీ నేతలను బన్సాల్ కోరారు.
వివాహేతర సంబంధం : ఆర్ఎంపీ కిడ్నాప్ కలకలం.. దొంగచాటుగా టూ వీలర్ మీద తరలిస్తుంటే..
మిగిలిన ప్రచార సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పోలింగ్ బూత్‌ల వద్ద నిఘా పెంచాలని, స్థానిక నేతలకు కూడా పార్టీ అగ్రనేతలు సూచించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో అరవింద్ మాట్లాడుతూ.. గతంలో పోరాటయోధులుగా పేరొందిన పార్టీలు ఇప్పుడు టీఆర్‌ఎస్ బౌన్సర్లుగా మారాయని కమ్యూనిస్టు పార్టీలపై మండిపడ్డారు. వామపక్షాలు తమ సమగ్రతను, ఔచిత్యాన్ని కోల్పోయాయి’ అని అరవింద్ అన్నారు.
ఇదిలా ఉండగా, ఎన్నికల వేళ మునుగోడు నియోజకవర్గంలో సోమవారం ఉదయం వాహనాల తనిఖీలో కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్ భర్త నుంచి కోటి రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ 13వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఎస్.వేణు(48) మాట్లాడుతూ.. మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు విజయవాడ నుంచి నగదు తీసుకువస్తున్నట్లు తెలిపారు.
నల్గొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీల్లో భాగంగా చెలిమెడ ఎక్స్ రోడ్స్ వద్ద కారును అడ్డుకున్నారు. వివేక్ చెప్పడంతో విజయవాడకు చెందిన రాము వద్ద నగదు సేకరించి తీసుకువస్తున్నట్లు వేణు మాకు తెలిపారని పోలీసులు అన్నారు. స్వాధీనం చేసుకున్న నగదును తదుపరి విచారణ కోసం ఆదాయపు పన్ను నోడల్ అధికారికి అందజేస్తామని నల్గొండ పోలీసులు తెలిపారు. ఈ నగదును ఎవరికి అందించాలనుకున్నారో తేలాల్సి ఉంది. నల్గొండ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నియోజక వర్గంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అక్రమ మద్యం, అక్రమ నగదులను అడ్డుకుంటున్నారు.