హైదరాబాద్‌లోని అమ్నేషియా పబ్ నుంచి బాలికను కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రాజకీయంగా కూడా తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
హైదరాబాద్‌లోని అమ్నేషియా పబ్ నుంచి బాలికను కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రాజకీయంగా కూడా తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ ముట్టడికి యత్నించారు.
పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న జనసేన నాయకులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా బాధితురాలికి న్యాయం చేయాలంటూ జనసైనికులు నినాదాలు చేశారు. అసలైన దోషులను తప్పించే ప్రయత్నం జరుగుతుందని వారు ఆరోపించారు. నిన్నటి నుంచి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ వద్ద పలు సంఘాలు ఆందోళలకు దిగడంతో.. పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. పోలీసులు జనసేన నాయకులను అడ్డుకుని గోషామహాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జనసైనికులు నిరసన నేపథ్యంలో.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి పెద్దమ్మతల్లి టెంపుల్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది.
మరోవైపు తెలంగాణ డీజీపీ కార్యాలయం ముట్టడిని యూత్ కాంగ్రెస్ నాయకులు యత్నించారు. బాలికపై జరిగిన దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మీడియాలో సంచలనం అయ్యేవరకు పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు.
ఇక, శుక్రవారం బీజేపీ నేతలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టింది. ఈ కేసులో నగర పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ మద్దతుదారులు పోలీస్ స్టేషన్ గ్రౌండ్ ఫ్లోర్‌లోకి దూసుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ, నిందితులను వెంటనే అరెస్టు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
దీంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు బలగాలను మోహరించారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి పరిస్థిని సమీక్షించాల్సి వచ్చింది. పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్‌లు, జోన్‌ల నుండి పోలీసులను రప్పించారు. నిరసనకారులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
