పెద్దపల్లి: దేశ రక్షణ కోసం ఇటీవల చైనా బార్డర్లో ప్రాణాలను కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబు ఘటన మరువక ముందే తెలంగాణకు చెందిన మరో  సైనికుడు వీరమరణం పొందాడు. జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌ లో పాకిస్థాన్ ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగెపల్లి గ్రామానికి చెందిన యువ జవాన్ శాలిగాం శ్రీనివాస్(28) మృతిచెందాడు. ఈ విషాద ఘటనపై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పందిస్తూ సంతోష్ బాబు మాదిరిగానే శ్రీనివాస్ కుటుంబానికి సాయం చేయాలని సీఎం కేసీఆర్ కు  సూచించారు. 

''జమ్ము కాశ్మీర్ లో తీవ్రవాదుల దాడిలో తెలంగాణ బిడ్డడు ప్రాణాలు కోల్పోవడం ఎంతో దురదృష్టకరం. పెద్దపల్లి జిల్లా నాగారం గ్రామానికి చెందిన సాలిగం శ్రీనివాస్ (28) దేశం మీద ప్రేమతో ఏడేళ్ల కిందట మన సైన్యంలో చేరి, చిన్న వయస్సులోనే అమరజీవి కావడం చాలా బాధ అనిపించింది. బాధాతప్త హృదయంతో అమర జవాన్ కు నివాళి అర్పిస్తున్నా'' అని పవన్ అన్నారు. 

read more   ఉగ్ర దాడుల్లో వ్యక్తి మృతి: తాతా! లే!! అంటూ 3 ఏళ్ల బాలుడి రోదన

''నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన శ్రీ శ్రీనివాస్ కుటుంబ నేపథ్యం తెలుసుకున్నప్పుడు గుండె భారమైంది. శ్రీనివాస్ కు రెండేళ్ల క్రిందటే వివాహం కాగా భార్యతోపాటు తల్లిదండ్రులు, తమ్ముడు వున్నారు. తండ్రి పశువుల కాపరిగా, తమ్ముడు తాపీ కార్మికునిగా పని చేస్తూ  శ్రీనివాస్ జవానుగా ఎదగడానికి అండదండలు అందించారు. ఈయన మరణంతో దేశం ధైర్య సాహసాలు గల ఒక జవానును కోల్పోయింది'' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

''చేతికి అందివచ్చిన బిడ్డ కళ్లెదుటే కనుమరుగవడంతో  ఒక నిరుపేద కుటుంబానికి  తీరని శోకాన్ని మిగిల్చింది. చైనా సరిహద్దులో జరిగిన పోరాటంలో సంతోష్ బాబు అనే వీరుడిని తెలంగాణ కోల్పోగా, కొద్ది రోజుల వ్యవధిలోనే  శ్రీనివాస్ కూడా అమరుడు అవ్వడం అత్యంత విషాదకరమైన సంఘటన. ఈ సందర్భంగా అమర జవాన్  సాలిగం శ్రీనివాస్ కు నా తరపున, జనసేన పార్టీ తరపున నివాళులు అర్పిస్తున్నాను'' అని పవన్ వెల్లడించారు. 

''యువ జవాన్న కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ కష్టాన్ని తట్టుకునే శక్తిని ఆ కుటుంబానికి ఇవ్వవలసిందిగా భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. సంతోష్ బాబు కుటుంబాన్ని ఆదుకున్న రీతిలోనే శ్రీనివాస్ కుటుంబానికి కూడా అండగా నిలవాలని కె.చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని కోరుతున్నాను'' అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.