Asianet News TeluguAsianet News Telugu

స్వప్నలోక్ అగ్నిప్రమాదం : పవన్ దిగ్భ్రాంతి, ఇకనైనా తనిఖీలు చేపట్టండి .. సర్కార్‌కు వినతి

సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై శాస్త్రీయంగా దర్యాప్తు చేపట్టాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 

Janasena Chief Pawan Kalyan Condolence Message Over swapnalok complex fire accident
Author
First Published Mar 17, 2023, 4:29 PM IST

సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పాతికేళ్లు కూడా నిండని నలుగురు యువతులు, ఇద్దరు యువకులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఉద్యోగం కోసం పొట్ట చేత్తో పట్టుకుని రాజధానికి వచ్చిన తెలంగాణ బిడ్డలు ఈ ప్రమాదంలో అశువులు బాయడం చాలా బాధించిందని పవన్ విచారం వ్యక్తం చేశారు. వీరంతా దిగువ మధ్య తరగతి కుటుంబాల వారని.. అగ్ని ప్రమాదంలో చిక్కుకుని ఎలా బయటపడాలో తెలియక పొగతో ఉక్కిరిబిక్కిరై చివరకు ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై శాస్త్రీయంగా దర్యాప్తు చేపట్టాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 

ఇటీవలే సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారని.. ఇప్పుడు ఈ ప్రమాదం జరగడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వరుస ప్రమాదాల నేపథ్యంలో భవన నిర్మాణ సమయంలో సరైన ప్రమాణాలు పాటించారా లేదా అనేది తెలియాల్సి వుందన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి అవకాశం కలుగుతుందని పవన్ తెలిపారు. కార్యాలయాలు, షాపింగ్ మాల్స్‌ను తరచుగా తనిఖీ చేయడంతో పాటు అక్కడి విద్యుత్ లైన్ల నిర్వహణను పరిశీలించాలని జనసేనాని డిమాండ్ చేశారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని.. మృతుల కుటుంబాల వారికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని పవన్ కోరారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ALso Read: మంటల్లో చిక్కుకున్నస్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ .. ఆరుగురి దుర్మరణం.. మృతులందరూ పాతికేళ్ల లోపు వారే.

సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ సమీపంలోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ ‌లో గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది అంతస్తుల ఈ భవనంలో తొలుత ఏడో అంతస్తులో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. అలా మొదలైన మంటలు క్రమక్రమంగా బిల్డింగ్ లోని మిగతా అంతస్తులకు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన పైర్ ఇంజన్స్‌తో అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు మొత్తం డజన్‌కి పైగా ఫైర్ ఇంజన్స్‌ని ఉపయోగించారు..

ఈ కాంప్లెక్స్ లో వస్త్ర దుకాణాలతోపాటు కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, కాల్‌ సెంటర్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఉంటాయి. నిత్యం రద్దీగా ఉంటే ఈ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ఉన్నవారంతా భయాందోళనలకు లోనయ్యారు. వివిధ మార్గాల్లో బయటకు పరుగులు దిశారు. మంటలు క్రమంలో వ్యాప్తి చెందడంతో పొగ, అగ్నికీలలతో పెయింట్‌ డబ్బాల లాంటివి పేలడంతో కొందరు కిందికి రాలేకపోయారు.

మంటల్లో దాదాపు 15 మందికి పైగా చిక్కుకుపోయారు. వారిని  అగ్నిమాపక సిబ్బంది భారీ క్రేన్ల సాయంతో కాపాడారు. వీరిలో ఆరుగురిని అపస్మారక స్థితిలో బయటికి తీసుకొచ్చారు. వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. కానీ.. వారిని వైద్యులు కాపాడలేకపోయారు. ఈ క్రమంలో గాంధీ ఆసుపత్రిలో ప్రమీల (22),వెన్నెల(22), శ్రావణి(22), త్రివేణి(22), శివ(22)లు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అదే సమయంలో అపోలో ఆసుపత్రిలో ప్రశాంత్‌ (23) కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios