తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలే తమ లక్ష్యాలని, నీళ్లు, నిధులు, నియామకాలు యువతకు అందాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ నేతలతో సమావేశమై 26 నియోజకవర్గాలకు బాధ్యులను నియమించారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంటున్న జనసేన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ దృష్టి సారిస్తున్నది. తెలంగాణ పై జనసేన పార్టీ అభిప్రాయం, ఇక్కడ ఆ పార్టీ లక్ష్యం గురించి జనసేనాని పవన్ కళ్యాణ్ సోమవారం ఏపీలో మంగళగిరిలోని జనసేన పార్టీ హెడ్ క్వార్టర్‌లో పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన జనసేన నేతలతో ఆయన సమావేశమై కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నేరవేర్చడమే తమ పార్టీ లక్ష్యం అని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ ఉదమ్యంలో సుమారు 1300 మంది మరణించారు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. కానీ, ఆ ఉద్యమ ఆకాంక్షలైనా నీళ్లు, నిధులు, నియామకాలు ఇంకా ఆ రాష్ట్ర యువతకు అందాల్సి ఉన్నదని జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రతి ఊరికి కనీసం పది మంది ఉద్యమంతో మమేకం కావడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన రూపుదాల్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు.

జనసేన పార్టీ యూత్ వింగ్‌తో ప్రారంభమై ఈ రోజు రాష్ట్రంలో ఒక ప్రధాన పార్టీగా ఎదిగిందని తెలిపారు. జనసేన భావజాలానికి ఆకర్షితులైన యువత ప్రతిగ్రామంలో ఉంటుందని, వారిని పట్టుకుని ముందుకు వెళ్లితే ఏదైనా సాధించగలమని వివరించారు. తెలంగాణ అభివృద్ధి, ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడమే జనసేన లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో నియోజకవర్గాలకు బాధ్యులను ప్రకటించారు. నియామక పత్రాలను వారికి అందించారు.

Also Read: పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పోలీసుల అనుమతి: జనసేన శ్రేణుల్లో జోష్

ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు బి మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ శంకర్ గౌడ్, జీహెచ్ఎంసీ అధ్యక్షులు రాధారం రాజలింగం పాల్గొన్నారు. ఆ బాధ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.

మునుగోడు నియోజకవర్గానికి గోకుల రవీందర్ రెడ్డి, కూకట్‌పల్లి నియోజకవర్గానికి ఇంచార్జీ నేమూరి శంకర్ గౌడ్, ఎల్బీ నగర్‌కు పొన్నరు లక్మి సాయి శిరీష, నాగర్ కర్నూలుకు వంగ లక్ష్మణ గౌడ్, వైరాకు తేజవత్ సంపత్ నాయక్, ఖమ్మం నియోజకవర్గానికి మిరియాల రామకృష్ణ, కుత్బుల్లాపూర్‌కు నందగిరి సతీష్ కుమార్, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి డాక్టర్ మాధవరెడ్డి, పటాన్ చెరువుకు ఎడమ రాజేశ్, సనత్ నగర్‌కు మండపాక కావ్య, ఉప్పల్‌కు వైఎంఎన్ఎస్ఎస్‌వి నిహారిక నాయుడు, ఉప్పల్‌కు శివ కార్తీక్ (కో కన్వీనర్), కొత్తగూడెం నియోజకవర్గానికి వేముల కార్తీక్, అశ్వరావుపేటకు డేగల రామచంద్రరావు, పాలకుర్తికి వి నగేశ్, నర్సంపేటకు మేరుగు శివకోటి యాదవ్, స్టేషన్ ఘనపూర్‌‌కు గాదె పృథ్వీ, హుస్నాబాద్‌కు తగరపు శ్రీనివాస్, రామగుండానికి మూల హరీశ్ గౌడ్, జగిత్యాలకు బెక్కం జనార్దన్, నకిరేకల్‌కు చెరుకుపల్లి రామలింగయ్య, హుజుర్ నగర్‌కు ఎస్ నాగేశ్వరరావు, మంథనికి మాయ రమేశ్, కోదాడకు మేకల సతీశ్ రెడ్డి, సత్తుపల్లికి బండి నరేష్, వరంగల్ వెస్ట్‌కు బైరి వంశీకృష్ణ, వరంగల్ ఈస్ట్‌కు బాలు గౌడ్‌లను నియమించారు.


మునుగోడు బాధ్యుడిగా గోకుల రవీందర్ రెడ్డి:

మునుగోడు నియోజకవర్గానికి జనసేన పార్టీ బాధ్యుడిగా గోకుల రవీందర్ రెడ్డిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. ఇందుకు సంబంధించిన నియామకపత్రాన్ని ఆయనకు అందించారు. ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం జూన్ 12వ తేదీ వరకు ఆయన బాధ్యుడిగా కొనసాగుతారని వివరించారు. ఈ సందర్భంగా గోకుల రవీందర్ రెడ్డిని అభినందిస్తున్నట్టు హామీ పత్రంలో పేర్కొన్నారు.