ఉత్తమ్ ‘‘వీపు గోకుడు’’ పాలసీపై జానారెడ్డి గుస్సా

janareddy peeved at Uttam fan club politics and says he wont attend bus yatra meetings
Highlights

కాంగ్రెస్ లో గుస గుసలు

తెలంగాణలో ఒక సామెత ఉంది. దానిపేరు వీపు గోకుడు సామెత. నీ వీపు నేను గోకుతా.. నా వీపు నువ్వు గోకు అన్నట్లు ఉంటుంది. ఒకరినొకరు పొడుగుకుంటున్న సందర్భంలో వీపు గోకుడు సామెతను వాడతారు. ఇదెలా ఉంటుదంటే.. నా గురించి నువ్వు గొప్పగా చెప్పు.. నీ గురించి నేను గొప్పగా చెబుతాను అన్నట్లుగా. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో పిసిసి ప్రసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ తరహా వీపు గోకుడు పాలసీని ప్రయోగిస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఉత్తమ్ ఈ తరహా యాక్టివిటీ పట్ల సీనియర్ కాంగ్రెస్ నేత, సిఎల్పీ నాయకుడు జానారెడ్డి గుర్రుగా ఉన్నారు. ఆయన తన అసహనాన్ని బస్సు యాత్రలోనే వెల్లడించారు. ఇంతకూ ఈ వీపు గోకుడు కథ ఎందుకొచ్చిందబ్బా అనుకుంటున్నారా?  కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైన వీపుగోకుడు కథ కమామిషు ఏంటో చదవండి.

కాంగ్రెస్ శ్రేణులను సన్నద్ధం చేసే ఉద్దేశంతో పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బస్సు యాత్రను షురూ చేశారు. యాత్ర తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ నింపిందన్న ప్రచారం ఉంది. అయితే ఈ బస్సు యాత్రలో కొన్ని చోట్ల కొత్త చిక్కులు వస్తున్నాయని చెబుతున్నారు. బుధవారం కాంగ్రెస్ బస్సు యాత్ర పాలకుర్తిలో జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావు కంచుకోట అయినప్పటికీ మంచి స్పందన వచ్చింది, 20 వేల కు పైగా ప్రజలు వచ్చారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. ఈ సభలో జానారెడ్డి అసహనం వ్యక్తం చేసేవరకు వచ్చింది. పాలకుర్తి సభలో ప్రసంగించిన తర్వాత ఇకపై నేను బస్సు యాత్ర సభలకు రానని కూడా జానారెడ్డి తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఇలా ఎందుకు పిలుస్తారు. పిలిచి ఎందుకు ఇలా చేస్తారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారట. జానారెడ్డి కే కాదు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు కూడా కొద్దిగా ఆగ్రహాన్ని కలిగించిందని చెబుతున్నారు.

పాలకుర్తి సభలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, స్థానిక నేత జంగా రాఘవ రెడ్డి, మరో నేత రవీందర్ నాయక్ లాంటి కొందరు నేతల ప్రసంగాలు జానాతోపాటు సీనియర్లకు చిరాకు తెప్పించాయని అంటున్నారు. వారందరితో ఉత్తమ్ కుమార్ రెడ్డి లోపాయికారిగా మాట్లాడుకుని వచ్చే ఎన్నికల్లో తానే సీఎం అభ్యర్థిని అని వారితో చెప్పించుకున్నాడని సీనియర్ల వాదన. వారంతా కాబోయే సీఎం ఉత్తమ్ అని ప్రసంగాలు చేశఆరు. దీంతో జానా లాంటి సీనియర్లు చికాకు పడ్డట్లు తెలిసింది. వాళ్లు అలా ఉత్తమ్ సిఎం అని ప్రసంగాలు చేస్తుంటే.. ఉత్తమ్ కూడా అదే సభలో జంగా రాఘవరెడ్డి పాలకుర్తి అసెంబ్లీ అభ్యర్థి అని సభలో ప్రకటించేశారు. ఇలా సిఎం ఉత్తమ్ అని వాళ్లు ప్రసంగించడం.. వాళ్లను అసెంబ్లీ అభ్యర్థులుగా ఉత్తమ్ ప్రకటించడం ద్వారా వీపు గోకుడు పాలసీని అమలు చేస్తున్నారని సీనియర్లు గుర్రుగా ఉన్నారట.

loader