Asianet News TeluguAsianet News Telugu

బిడ్డలాంటిదానితో ఐలవ్యూ అంటాడా?... ఎమ్మెల్యే రాజయ్యపై జానకీ పురం సర్పంచి నవ్య వేధింపుల ఆరోపణలు..

ఎమ్మెల్యే రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు ఓ మహిళా సర్పంచ్. తండ్రిలాంటి వారని చెబితే.. తనతో ఐలవ్యూ అని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Janakipuram sarpanch navya harassment allegations against MLA Rajaiah - bsb
Author
First Published Mar 11, 2023, 7:53 AM IST


హనుమకొండ : ఓ మహిళా సర్పంచ్ ఎమ్మెల్యేపై వేదింపుల ఆరోపణలు చేసింది. రెండేళ్లుగా స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే టి రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం జానకిపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య ఆరోపించడం సంచలనంగా మారింది. తన భర్త ప్రవీణ్ తో కలిసి శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.. ‘రెండేళ్ల నుంచి నన్ను స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టి రాజయ్య వేధిస్తున్నారు. మా గ్రామానికి మొదటి నుంచి నిధులు కూడా విడుదల చేయడం లేదు. 

కొంతకాలం క్రితం మా పిల్లల పుట్టిన రోజు సందర్భంగా ఆయనను కలిసాము. మీరు మాకు తండ్రి లాంటివారు ఇలా చేయడం తగదు అని కూడా చెప్పాం. అయినా ఎమ్మెల్యే ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ వేధింపులు భరించలేక గత కొంతకాలంగా ఆయనకు దూరంగా ఉంటున్నాం. వీటన్నింటినీ మనసులో పెట్టుకుని మా గ్రామానికి నిధులు ఇవ్వడం లేదు. దీనికి తోడు బీఆర్ఎస్ మహిళ ఒకరు నన్ను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించింది. నాతో మాట్లాడుతూ..  చాలామంది మహిళలు సార్ దగ్గరికి వచ్చి పోతుంటారు.  మీ గ్రామానికి నిధులు రావాలంటే.. మీ అవసరాలు తీరాలంటే మీరూ వస్తే  తీరతాయి.. అని నన్ను ప్రలోభట్టడానికి ప్రయత్నించింది.

విషాదం : ఆటో నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్ మృతి..

 అయితే నేను అలాంటి దాన్ని కాదని ఆమెకి క్లియర్ గా చెప్పాను. టైం వచ్చినప్పుడు ఆ మహిళ ఎవరో పేరుతో సహా బయటపెడతా. వాళ్లందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి. ఎలాంటి మాటలు మాట్లాడాడంటే... నామీద కోరికతోనే..  నేనంటే ఇష్టంతోనే పార్టీ టికెట్ నాకు ఇచ్చానని అంటాడా? ఎమ్మెల్యే వేధింపులు భరించలేకపోయాను. నేను తండ్రి లాంటివాడివి అంటే.. బిడ్డ లాంటి దానితో ఐ లవ్ యు అని చెబుతాడా?  ఇవన్నీ నిజాలు కాదా? తప్పు చేసి  బుకాయించడం ఎందుకు? తప్పు చేసినప్పుడు ధైర్యంగా ఒప్పుకోవాలి. నా వెనక ఎవరో ఉండి..  ఇదంతా ఆయన మీద కావాలని చేయిస్తున్నానని అంటారా?  ఇది న్యాయమేనా ?  

నేను ఆడపిల్లను.. ఆట బొమ్మను కాదు.  ఇలా నలుగురులోకి వచ్చి నాకు జరిగిన అవమానాన్ని చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది. కానీ నేనొక్క దాన్ని బయటికి రావడం వల్ల నన్ను చూసి ఎమ్మెల్యే వేధింపులకు గురై.. మౌనంగా భరిస్తున్న మిగతా మహిళలు కూడా బయటకి వస్తారని ఇలా వచ్చాను. ఎమ్మెల్యే రాజయ్య వేధింపుల మీద ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల దృష్టికి తీసుకువెళ్తా. నా ఆవేదనను చెబుతాను. వారు అర్థం చేసుకుని న్యాయం చేపిస్తారని నమ్మకం ఉంది’  అని నవ్య అన్నారు.

అయితే దీనిమీద ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో తన మీద కొందరు కుట్రలు  చేస్తున్నారని అన్నారు. తనను అప్రతిష్ట పాలు చేసేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు. దీనిమీద తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడారు. ఈ కుట్ర వెనుక ఇంటి దొంగలే ఉన్నారని అన్నారు. వారు శిఖండి పాత్ర పోషిస్తున్నారని టైం వచ్చినప్పుడు ముఖ్యమంత్రిని కలిసి అన్ని విషయాలు చెబుతానని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios