హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ కాంగ్రెసు నేత, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు.  యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కలిసి పోరాటం చేద్దామని ఆయన రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ కాంగ్రెసు నేతలతో చెతులు కలపడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు వి హనుమంతరావుతో కూడా పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాదులోని దస్పల్లా హోటల్లో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరు కావాలని పవన్ రేవంత్ రెడ్డిని కోరారు. 

పవన్ కల్యాణ్ ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి అఖిల పక్ష సమావేశానికి హాజరు కానున్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సినీ ప్రముఖులు కూడా గళమెత్తుతున్నారు.

సేవ్ యురేనియం పేరిట సోషల్ మీడియాలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోస్టులు విరివిగా పెడుతున్నారు. తెలంగాణ కాంగ్రెసు నేత వి. హనుమంతరావుతో కలిసి పవన్ కల్యాణ్ ఇటీవల మాట్లాడిన విషయం తెలిసిందే. తెలంగాణలో పవన్ కల్యాణ్ కాంగ్రెసుకు దగ్గర కావాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.