తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి పదవినే త్యాగం చేశానని కాంగ్రెసు శాసనసభా పక్షం (సిఎల్పీ) నేత కుందూరు జానారెడ్డి అన్నారు.

నల్లగొండ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి పదవినే త్యాగం చేశానని కాంగ్రెసు శాసనసభా పక్షం (సిఎల్పీ) నేత కుందూరు జానారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరులో మంగళవారం కాంగ్రెసు ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. 

రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సోనియాగాంధీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టి అందోళనలను అదుపులోకి తీసుకురావాలని తనను కోరారని, అయితే ప్రత్యేక రాష్ట్రం ఇస్తేనే ముఖ్యమంత్రి పదవి చేపడుతానని సోనియాకు స్పష్టం చేశానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి పదవిని చేపడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయనే ఉద్దేశంతో తాను ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. 

నలబై ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా పదవుల కోసం పాకులాడలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ పాలనలో జరిగిందని, నాలుగేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని ఆయన అన్నారు. 

టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఊరికైనా విద్యుత్, రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించిందా అని ఆయన ప్రశ్నించారు.