నల్గొండ: సీఎం పదవి కంటే తెలంగాణ సాధనే ముఖ్యమని జానారెడ్డి భావించారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు.మంగళవారం నాడు ఆయన నాగార్జునసాగర్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో సోనియాగాంధీ పిలిచి జానారెడ్డికి సీఎం పదవిని ఇస్తామని చెప్పినా కూడ ఆయన ఈ పదవిని తీసుకోలేదన్నారు.

తెలంగాణ సాధన కోసం జానారెడ్డి నిబద్దతను ఈ ఘటన రుజువు చేస్తోందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.రాష్ట్రంలో ఏవరైనా ప్రజాప్రతినిధి మరణిస్తే మరణించిన కుటుంబం నుండి  ఎవరైనా అభ్యర్ధిని బరిలోకి దింపితే ఏకగ్రీవంగా ఎన్నిక నిర్వహించే సంప్రదాయం ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఉండేదని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

రాగ్యానాయక్ ను మావోయిస్టులు హత్య చేసిన సమయంలో  దేవరకొండ నుండి రాగ్యానాయక్ సతీమణిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా అప్పటి సీఎం చంద్రబాబునాయుడు, విపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకొన్నారని ఆయన గుర్తు చేశారు.తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సంప్రదాయం అమలు కాలేదన్నారు.

తెలంగాణ ప్రాంత హక్కుల కోసం పీజేఆర్ పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 1994లో టీడీపీ ప్రభుత్వంపై, 2004లో స్వంత పార్టీ ప్రభుత్వంపై పీజేఆర్ పోరాటం చేశారని ఆయన చెప్పారు. పోతిరెడ్డి పాడుకు వ్యతిరేకంగా పీజేఆర్ పోరాటం చేశారన్నారు.