పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించే వరకు తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది సస్పన్స్ గానే ఉంచుతానని పేర్కొన్నారు.
తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం ఇప్పుడే ఎవరికీ చెప్పనని సీఎల్పీ నేత జానా రెడ్డి పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఆయన పలనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారంటూ రోజు రోజుకీ వార్త ప్రచారంలోకి వస్తోంది. కాగా.. ఈ విషయంపై ఆయన స్పందించారు.
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బంకాపురం గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు ఉన్నం సత్యనారాయణ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తాను పోటీ చేసే నియోజకవర్గం గురించి ఊహాగానాలు ఎక్కువగా సాగుతున్నాయన్నారు. పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించే వరకు తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది సస్పన్స్ గానే ఉంచుతానని పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ నుంచి కాకుండా ఈసారి మిర్యాలగూడ నుంచి పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారం గురించి మాట్లాడాలని కోరగా... ఎక్కడ నుంచి పోటీ చేసేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచుతున్నట్లు చెప్పారు. తమ నిర్ణయం కోసం పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారని విలేకరులు ప్రస్తావించగా ఇంకా సమయం ఉందిగా అంటూ దాట వేశారు. పార్టీ శ్రేణులు, అభిమానులు అందరితో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటానన్నారు.
