మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెసు సీనియర్ నేత ఎస్ జైపాల్ రెడ్డికి, మాజీ మంత్రి డికె అరుణకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. జిల్లాలో ఒకరిపై మరొకరు ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అధిష్టానంతో సన్నిహిత సంబంధాలున్న కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి డికె అరుణకు కుంపటి రాజేసే ప్రయత్నంలో ఉన్నారు.

జైపాల్ రెడ్డికి అధిష్టానంతో సాన్నిహిత్యమే కాకుండా తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు కూడా సహకరిస్తున్నాయి. జైపాల్ రెడ్డి వ్యూహంలో భాగంగానే గతంలో రేవంత్ రెడ్డి టీడీపిలోకి వచ్చారని అంటున్నారు. అలాగే ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి బిజెపి నుంచి కాంగ్రెసులోకి వచ్చారు. 

ఆ ఇద్దరిని చేర్చుకోవడాన్ని డికె అరుణ తీవ్రంగా వ్యతిరేకించారు. వారిద్దరి వల్ల తన ఆధిపత్యం దెబ్బ తింటుందనేది ఆమె ఉద్దేశంగా చెబుతారు. రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దనే అరుణ విజ్ఞప్తిని అధిష్టానం తోసిపుచ్చింది. నాగం జనార్దన్ రెడ్డి విషయంలోనూ అదే జరిగింది.

ప్రస్తుతం నాగం జనార్దన్ రెడ్డిని చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ కూచుమళ్ల జనార్దన్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధపడ్డారు. ఆయనను నిలవరించేందుకు డికె అరుణ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందులో భాగంగానే ఆమె జనార్దన్ రెడ్డితో భేటీ అయ్యారు.

కాగా, తెలంగాణలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఎదుర్కోవడానికి ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉన్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, తదితరులను ఏదో విధంగా ఒప్పించి, ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే పనిలో రాహుల్ గాంధీ పడ్డారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డిలను పార్టీలో చేర్చుకున్నారు. 

ఇది కాస్తా జైపాల్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కలిసి వస్తోంది. డికె అరుణ ప్రాబల్యం క్రమేణా తగ్గి తన ప్రాబల్యం పెరుగుతుందనే ఉద్దేశంతో జైపాల్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు.