నేనే కాదు... ఎవరు పోటీచేసినా గెలిపించండి..: జగిత్యాల ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)
తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైన సమయంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
జగిత్యాల : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలయ్యింది. అతి త్వరలో బిఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రజా వ్యతిరేకతతో పాటు వివిద వివాదాల కారణంగా కొందరు సిట్టింగ్ లకు ఈసారి పోటీచేసే అవకాశం దక్కకపోవచ్చంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
వివిధ అభివృద్ది పనుల శంకుస్థాపన కోసం జగిత్యాల పట్టణం 10వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ పర్యటించారు. కార్యక్రమాల అనంతరం స్థానికులతో ఎమ్మెల్యే సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఇప్పటికయితే జగిత్యాలలో మళ్లీ ఎవరు పోటీ చేస్తారో తెలియదని... మళ్లీ తనకే అవకాశం వస్తే ఓటేసి గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. తాను కాకుండా వేరేవాళ్లు పోటీచేసినా బిఆర్ఎస్ పార్టీనే గెలిపించుకోవాలంటూ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
వీడియో
తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగిత్యాలను ఎంతో అభివృద్ది చేసానని సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతోనే ఈ అభివృద్ది పనులు చేయగలిగానని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు... ఎక్కడి నుండి ఎవరు పోటీ చేస్తారో తెలీదన్నారు. ఒకవేళ మళ్లీ తనకే జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం వస్తే గెలిపించాలని ఎమ్మెల్యే కోరాడు.
బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ఎంతగానో మారిందని జగిత్యాల ఎమ్మెల్యే అన్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల గురించి ఎన్నికల సమయంలో చెప్పలేదు... కానీ అన్నదాల కోసం కేసీఆర్ ఈ పథకాలను తీసుకువచ్చాడని అన్నారు. ఇలాంటి నాయకుడికి మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని... కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఎమ్మెల్యే సంజయ్ ప్రజలను కోరారు.
ఇదిలావుంటే ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అధికార బిఆర్ఎస్ లో టికెట్ల లొల్లి మొదలయ్యింది. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి కేసీఆర్ అవకాశం ఇవ్వడంలేదంటూ సోషల్ మీడియాలోనే కాదు ప్రధాన మీడియా మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా చోట్ల సిట్టింగ్ లు అప్రమత్తమై తమ అనుచరులతో ఇప్పటికే రాజకీయ భవిష్యత్ గురించి చర్చలే జరుపుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియకు ఈసారి బిఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదే కేసీఆర్ నిర్ణయమైతే తాము చాలా సంతోషిస్తామని... తాము కోరుకునేది కూడా ఇదేనంటూ కొందరు ఇల్లందు బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇక ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి కూడా టికెట్ దక్కకపోవచ్చని... అలాగని ఈ టికెట్ ఆశిస్తున్న జిహెచ్ఎంసి మాజీ మేయర్ కు కూడా ఆ అవకాశం దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేరును బీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తుందనే ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే, మాజీ మేయర్ తో ఎమ్మెల్సీ కవిత భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎస్సీ రిజర్వుడ్ జహిరాబాద్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావుపై ప్రజా వ్యతిరేకత దృష్ట్యా ఇటీవలే బిఆర్ఎస్ లో చేరిన నరోత్తంకు టికెట్ ఇవ్వాలని అదిష్టానం భావిస్తోందట. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు ఆందోళన నెలకొంది.