రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి ఫిర్యాదు: సోనియా, రాహుల్‌గాంధీలకు లేఖ
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మార్చాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు. ఈ మేరక కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో పాటు, పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు కూడా ఆయన లేఖ రాశారు.
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు Sonia gandhiకి, Rahul gandhi లకు లేఖ రాశారు. టీపీసీసీ చీఫ్ Revanth Reddy ని మార్చాలని ఆ లేఖలో కోరారు.
పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని మీరు నియమించినా తాము కలుపుకుపోవాలని ప్రయత్నించామన్నారు.పార్టీ లైన్ లో కాకుండా వ్యక్తిగత ఇమేజ్ కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. రేవంత్ ను పార్టీ డైరెక్షన్ లో నడిచేలా చూడాలని ఆ లేఖలో కోరారు. రేవంత్ రెడ్డి తన స్వంత జిల్లాలో కూడా ఎమ్మెల్సీ అభ్యర్ధిని బరిలోకి దింపలేని విషయాన్ని ఆ లేఖలో గుర్తు చేశారు. రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి వ్యక్తిగత విబేధాలు లేవన్నారు.
పార్టీని బలోపేతం చేయడం కోసమే ఈ లేఖను రాస్తున్నట్టుగా జగ్గారెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి స్టార్ లీడర్ గా ఎదగాలని అనుకొంటున్నాడని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. గ్రామస్థాయికి వెళ్లి పనిచేసే ఉద్దేశ్యం రేవంత్ రెడ్డికి లేదన్నారు.Erravalliలో రేవంత్ రెడ్డి ఇవాళ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి సమాచారం అందలేదు.
also read:కేసీఆర్ బండారం బయటపెట్టేందుకే రచ్చబండ: రేవంత్ రెడ్డి
ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం విషయమై కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చర్చ జరగని విషయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఏకపక్షంగా రేవంత్ రెడ్డి కార్యక్రమాలను చేపట్టారని ఆయన విమర్శించారు. ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమానికి సంబంధించి జగ్గారెడ్డికి సమాచారం ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంత రావు కూడ తప్పుబట్టారు.అయితే ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసి అంబర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన కార్యక్రమం గురించి రేవంత్ రెడ్డి సమాచారం ఇవ్వకపోవడంపై జగ్గారెడ్డి మండిపడ్డారు. జహీరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఈ విషయమై మాజీ మంత్రి గీతారెడ్డికి కానీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తనకు కానీ సమాచారం ఇవ్వలేదని ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు.
అయితే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశానికి సీనియర్లను హాజరయ్యేలా అవకాశం కల్పించాలని కూడా జగ్గారెడ్డి గతంలో పార్టీ నాయకత్వానికి లేఖ రాశారు. దీంతో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో మరికొందరికి చోటు కల్పించారు. అయినా కూడా రేవంత్ రెడ్డి తన ఇష్టారీతిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం కూడా పార్టీలో చర్చకండానే నిర్ణయించారని రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి మండిపడుతున్నారు. ఈ విషయమై రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ పదవి నుండి తప్పించాలని కోరుతూ జగ్గారెడ్డి లేఖ రాశారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగ్గారెడ్డి మెదక్ జిల్లాలో అభ్యర్ధిని బరిలో నిలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నిలిపి పార్టీకి ఉన్న ఓట్ల కంటే ఎనిమిది ఓట్లు అధికంగా తెచ్చుకొన్నారు. పార్టీకి ఉన్న ఓట్లు రాకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి సవాల్ చేశారు. అంతేకాదు ఈ సవాల్ లో జగ్గారెడ్డి విజయం సాధించారు.