హైదరాబాద్: కాంగ్రెసు సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి కూడా బిజెపి వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి బిజెపియే ప్రత్యామ్నాయమని కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాంతో బిజెపిలో చేరడం లాంఛనమేననే మాట వినిపిస్తోంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు జగ్గారెడ్డి కూడా బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆదివారంనాడు రాజగోపాల్ రెడ్డి జగ్గారెడ్డికి ఫోన్ చేశారు. తనతో పాటు జగ్గారెడ్డిని బిజెపిలోకి తీసుకుని వెళ్లడానికే ఆయన ఫోన్ చేసి మాట్లాడినట్లు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపై  శనివారంనాడు మీడియా ప్రతినిధుల సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేయడంతోపాటు బిజెపికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీలో వాడీవేడీగా చర్చ జరుగుతోంది. 

ఇప్పటికే 12 మంది శాసనసభ్యులు టీఆర్ఎస్ లో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్‌లో మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఒరిద్దరిని మినహాయించి మిగిలిన వారితో ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. 

ఇదిలావుంటే, త్వరలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని బీజేపీ నేత లక్ష్మణ్‌ చెప్పారు. టీఆర్‌ఎస్‌ నేతలు సహా పలువురు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. చేరికలకు ముందు రాజీనామాలపై అధిష్ఠానానిదే నిర్ణయమని ఆయన చెప్పారు. తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. త్వరలో తెలంగాణలో అమిత్ షా పర్యటించనున్నారని తెలిపారు.

ప్రధాని దగ్గర ముఖం చెల్లకనే నీతిఆయోగ్‌ భేటీకి కేసీఆర్‌ వెళ్లలేదని విమర్శించారు. మళ్లీ మోడీ ప్రధాని కాలేరని తండ్రీకొడుకులు ఎన్నికల్లో ప్రచారం చేశారని ఆయన గుర్తుచేశారు. కాళేశ్వరానికి కేంద్రం ఎంతో చేసిందని, అందువల్ల మోదీని ఆహ్వానించాలని ఆయన అన్నారు.