హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడా అని ఎదురుచూస్తున్న నూతన మద్యం విధానం వచ్చే నెల 1వ తారీఖునుండి అమల్లోకి రానుంది. అక్టోబర్ 1వ తేదీనుండే నూతన విధానం అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ, పాత విధానాన్నే కొనసాగించాలా, లేక ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ మద్యం అమ్మకాలను పూర్తిగా చేతుల్లోకి తీసుకున్నట్టు తాము కూడా ఆ పద్దతిని ఫాలో అవ్వాలా అనే నిర్ణయానికి రావడానికి సమయం పట్టింది. ఇందుకోసం నెలరోజులపాటు పాత మద్యం విధానాన్ని పొడిగించారు. 

తొలుత జగన్ సర్కార్ అవలంబించిన విధానాన్నే ఫాలో అవ్వాలని కెసిఆర్ కూడా భావించారు.  ఈ మద్యం విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఎలా అమలు చేయబోతున్నారో జగన్ ను అడిగి కెసిఆర్ తెలుసుకున్నారు. మొన్నటి భేటీలో కెసిఆర్ కు జగన్ తమ ప్రభుత్వం ఏ విధంగా ఈ నూతన మద్యం విధానాన్ని నిర్వహించబోతుందో సవివరంగా వివరించాడు.   

 ప్రస్తుతానికి మద్యం దుకాణాలకు మద్యం సేల్స్ లో 20శాతం మార్జిన్ ఇస్తుంది ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వమే పూర్తి మద్యం వ్యాపారాన్ని హస్తగతం చేసుకుంటే మరింత ఎక్కువగా లాభాలు వస్తాయని భావిస్తుంది. అంతేకాకుండా మద్యంలో జరుగుతున్న కల్తీలకు అడ్డుకట్ట వేయవచ్చు. మద్యం సిండికేట్లు అనే ఊసే లేకుండా చేయొచ్చని భావించారు. 

కాకపోతే దీనికి సంబంధించి ఎక్సయిజ్ అధికారుల దగ్గరినుండి వ్యతిరేకత ఎదురయినట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అప్లికేషన్ ఫీజుల ద్వారా 400 కోట్లు, లైసెన్సుల ద్వారా 1000కోట్ల ఆదాయాన్ని సంవత్సరానికి ఆర్జిస్తోంది. ఒకవేళ ప్రబుజ్త్వమే ఈ మద్యం వ్యాపారాన్ని మొత్తం హస్తగతం చేసుకుంటే ఈ 1400 కోట్లు నష్టపోతుందనేది అధికారుల వాదన. 

అంతేకాకుండా ప్రభుత్వమే పూర్తిగా మద్యం వ్యాపారం నిర్వహిస్తే కొత్త తలనొప్పులు ఎదురవుతాయని అధికారులు వాదిస్తున్నారు. ఒకవేళ మద్యం స్టాకును గనుక ఎవరన్నా దొంగిలిస్తే పరిస్థితేంటని వారు ప్రశ్నిస్తున్నారు. దానికి ఎవరు బాధ్యత వహించాలని కూడా అడుగుతున్నారు. ఇలాంటి సంఘటనలవల్ల తీవ్ర నష్టాలూ వాటిల్లవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. 

అధికారుల వెర్షన్ ని సావధానంగా విన్న కెసిఆర్ పాత విధానానికే ఓకే చెప్పినట్టు సమాచారం. పాత విధానాన్ని కొనసాగించి ప్రైవేట్ వ్యక్తులకే కాంట్రాక్టులు ఇస్తే, ఆంధ్రప్రదేశ్ సర్కార్ నూతన మద్యం విధానం ద్వారా లాభం పొందాలని కెసిఆర్ గట్టి స్కెచ్ వేశారు. 

ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన లిక్కర్ కాంట్రాక్టర్లు తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు ఉవ్విల్లూరుతున్నారు. ముఖ్యంగా జంటనగరాల్లో, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలైన ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో మద్యం టెండర్లు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.  

ఇందుకు అనుగుణంగా లైసెన్స్ ఫీజులను, అప్లికేషన్ ఫీజు ధరలను భారీగా పెంచేసింది తెలంగాణ సర్కార్. నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును లక్ష రూపాయల నుండి ఒకే సారి రెండు లక్షల రూపాయలకు పెంచారు. లైసెన్సు ఫీజులను కూడా భారీగా పెంచారు. లైసెన్స్ స్లాబులను కూడా నాలుగు నుంచి ఆరు స్లాబులు చేసారు. 

మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణలోని కెసిఆర్ సర్కారుకు కాసుల వర్షం కురిపించనుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.