కేసిఆర్ కు కాకపుట్టించేందుకు కోదండరాం ఇంకో ప్లాన్

JAC now targets KCR ground zero siddipet district
Highlights

  • నిరుద్యోగ సమస్యపై ఉద్యమించిన జెఎసి
  • తాజాగా అన్నదాత ఆత్మహత్యలపై సమరశంఖం
  • తెలంగాణ స్వరాష్ట్రంలో అన్నదాతల బలిదానాలపై జాబితా విడుదల
  • నల్లగొండ ఫస్ట్, సిద్ధిపేట రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడి

నిరుద్యోగుల తరుపున తెలంగాణ జెఎసి మొక్కవోని దీక్షతో పోరాటం చేసింది. తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రపంచానికి చాటింది. అవాంతరాలను ఎదుర్కొని సర్కారుపై సమరశంఖం పూరించింది. టిఆర్ఎస్ సర్కారు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విషయాన్ని గాలికొదిలేసిన వైనాన్ని కొలువులకై కొట్లాల సభ ద్వారా సమాజం ముందు ఉంచింది. తెలంగాణ సమాజం ముందు తెలంగాణ సర్కారును దోషిగా నిలబెట్టింది. నిరుద్యోగ సమస్యతోపాటు తెలంగాణలో మరో తీవ్రమైన సమస్యపై  కూడా తెలంగాణ జెఎసి నడుం బిగించింది. అత్యంత ముఖ్యమైన మరో సమస్యను తెలంగాణ సర్కారు పట్టించుకోవడంలేదని, దానిపై సర్కారు మీద వత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఆ వివరాలు చదవండి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఇప్పటివరకూ ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల సంఖ్య 3362. అంటే సగటున నెలకు 80 మంది అన్నదాతలు ఊపిరి వొదులుతున్నారని జెఎసి చెబుతోంది. ప్రభుత్వ పథకాలన్నీ రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు, మధ్య దళారులకు వరాలుగా మారుతున్నాయని జెఎసి ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్కారు చర్యల వల్ల రైతులకు మిగిలిందేమీ లేదని జెఎసి ఆవేదన వ్యక్తం చేసింది. నిరుద్యోగ సమస్యతో పాటు, రైతాంగ సమస్యలపై ఈ ఆదివారం (17-12-2017) టీజేఏసీ ఉద్యమ కార్యాచరణ ఖరారు చేయనుంది. ప్రభుత్వం కదిలేలా, అన్నదాతకు భరోసా కలిగేలా అందరం నడుం కట్టాలి అని జెఎసి ఛైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు.

ఆత్మహత్యల్లో కేసిఆర్ జిల్లా నెంబర్ 2

తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి నేటివరకు జరిగిన రైతుల ఆత్మహత్యల జాబితాను జెఎసి విడుదల చేసింది. జాబితాలో 30 జిల్లాల వివరాలను వెల్లడించింది. జాబితాలో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. నల్లగొండ జిల్లాలో మూడున్నరేళ్లుగా 379 మంది రైతులు ఆత్మబలిదానం చేసుకున్నారు. ఇక కేసిఆర్ సొంత జిల్లా సిద్ధిపేటలో 279 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కేసిఆర్ సొంత జిల్లా రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో వరంగల్ రూరల్ జిల్లా, నాలుగో స్థానంలో ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో 9 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేడ్చల్ జిల్లా చివరి స్థానంలో ఉంది. అయితే హైదరాబాద్ జిల్లాలో వ్యవసాయం లేదు కాబట్టి జాబితాలో హైదరాబాద్ పేరు లేదు.

అన్నదాతకు భరోసా కల్పించడంలో తెలంగాణ సర్కారు ఘోరంగా విఫలమైందని జెఎసి అంచనాకు వచ్చింది. మూడున్నరేళ్ల కాలంలో ఉత్తుత్తి ప్రకటనలతో రైతుల కడుపు నింపిందని జెఎసి ఆగ్రహంగా ఉంది. అందుకే తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు ఏమాత్రం తగ్గలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అన్నింటిలో దేశంలోనే నెంబర్ 1 అంటూ ఊదరగొడుతూ రైతాంగాన్ని పట్టించుకోకుండా పాలన సాగిస్తున్నారని జెఎసి విమర్శిస్తోంది. కొలువులకై కొట్లాట తరహాలో మరో ఉద్యమానికి జెఎసి సన్నద్ధమవుతూ తెలంగాణ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసేందుకు కార్యాచరణ చేస్తోంది.

loader