పోలీసులు కోదండరాంను ఎక్కడికి తీసుకెళ్లారనే వివరాలు తెలియడం లేదు. 

తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాంను తర్నాకలోని ఆయన నివాసంలో రాత్రి 3 గంటలకు పోలీసులు అరెస్టు చేశారు. బలవంతంగా ఆయన ఇంట్లోకి చొరబడిన దాదాపు 300 మంది పోలీసులు ఇంటి తలపులు బద్దలు కొట్టి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కోదండరాం తో పాటు మరో 50 మందిని అరెస్టు చేశారు.

అయితే పోలీసులు కోదండరాంను ఎక్కడికి తీసుకెళ్లారనేదానిపై స్పష్టత లేకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ప్రొఫెసర్‌ ఆచూకీపై వెంటనే ప్రకటన చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. కీలక నాయకుల అరెస్టుల సమాచారంతో రాజధాని సహా రాష్ట్రమంతటా ఉద్రిక్తత నెలకొన్నట్లయింది. అరెస్టులకు పాల్పడితే ఆయా పోలీస్‌ స్టేషన్లలోనే శాంతియుతంగా నిరసన తెలుపుతామని జేఏసీ ఇదివరకే ప్రకటించింది.


నిరుద్యోగ ర్యాలీకి ర్యాలీకి అనుమతిలేదని, ఎవరైనాసరే నిషేధాజ్ఞలు మీరితే అరెస్టులు తప్పవని ఈస్ట్‌జోన్‌ డీసీపీ రవీంద్ర అన్నారు. ర్యాలీ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు, అదనపు బలగాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నగరాన్ని దాదాపు అష్ట దిగ్భంధనం చేశారు. 12 వేలకు పైగా సిబ్బందిని మోహరించారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీతో పాటు విద్యా సంస్థలు, కోచింగ్‌ సెంటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టిన అధికారులు ఆ ప్రాంతాల్లోనే 3 వేల మంది పోలీసులను మోహరించారు. సికింద్రాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇందిరాపార్క్‌ ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం నుంచే హైదరాబాద్‌ పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది.


కాగా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన కోదండరాంను పోలీసులు అరెస్టు చేసిన తీరుపై ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. టెరరిస్టుల మాదిరిగా పోలీసులు వ్యవహరించారని తప్పుపట్టాయి. తలుపులు బద్దలుకొట్టి కోదండరాంను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాయి.

పౌర ప్రజాస్వామిక హక్కులను కాపాడుతానన్న కేసీఆర్, ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, రాజ్యాంగ పరిధిలో నిరసన తెలిపే హక్కును నిరాకరిస్తూ తెలంగాణలో నియంత పాలన కొనసాగిస్తున్నాడని విమర్శించాయి.

వలసాంధ్ర ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి ఎటువంటి తేడాలు లేనటువంటి పాలన కొనసాగిస్తూ, ఫాసిస్టు విధానాలను అమలుపరుస్తూ ప్రజలపై నిర్బంధాన్ని కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని ధ్వజమెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన విద్యార్థులను, నిరుద్యోగ యువకులను, ప్రజాసంఘాల నాయకులను, జేఏసీ నాయకులను, హక్కుల కార్యకర్తలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.