వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయంలో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..!

రియల్ ఎస్టేట్ గ్రూప్ వంశీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్‌కు చెందిన కార్యాలయాలు, ఆస్తులపై ఐటీ అధికారులు రెండో రోజు సోదాలు నిర్వహిస్తున్నారు.

IT searches on premises of Vamsiram Builders continues on second day

రియల్ ఎస్టేట్ గ్రూప్ వంశీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్‌కు చెందిన కార్యాలయాలు, ఆస్తులపై ఐటీ అధికారులు రెండో రోజు సోదాలు నిర్వహిస్తున్నారు. వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయం, సంస్థ చైర్మన్ సుబ్బారెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే వంశీరామ్ బిల్డర్స్ ఉద్యోగుల ఖాతాల్లో భారీగా లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించినట్టుగా  తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల ఖాతాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఏడు బ్యాంకుల్లో కంపెనీకి లాకర్లు ఉన్నాయని.. వాటిని బుధవారం ఐటీ అధికారులు పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక,వంశీరామ్‌ బిల్డర్స్‌ డైరెక్టర్ల కార్యాలయాలు, నివాసాల్లో మంగళవారం తెల్లవారుజామున ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. హైదరాబాద్‌లో 15 చోట్ల, విజయవాడ, నెల్లూరులోని పలు ప్రాంతాల్లో దాడులు ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం వరకు ఈ సోదాలు జరిగాయి. నగరంలో సంస్థకు ఉన్న వెంచర్లకు సంబంధించి పన్ను ఎగవేతకు పాల్పడినట్లుగా, తెలియని మూలాల నుంచి సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లుగా ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిసింది.

వంశీరామ్ గ్రూప్ చైర్మన్ సుబ్బారెడ్డి, అతని బావమరిది జనార్ధన్ రెడ్డి నివాసాలతో వారి సన్నిహితుల ఇళ్లపైనా సోదాలు జరిగాయి.  సుబ్బారెడ్డి కార్యాలయాలు, నందగిరి హిల్స్, పెద్దమ్మ గుడి సమీపంలోని స్థలాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సుబ్బారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న 18 కంపెనీలకు చెందిన ఆస్తులపై సోదాలు జరిగినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లు, ఇతర మెటీరియల్‌లను స్వాధీనం చేసుకున్నట్టుగా  తెలుస్తోంది. రెండు సూట్‌కేసుల్లో పత్రాలను ఐటీ ఆఫీసుకు తరలించారు. 

సోదాలు సందర్భంగా ఐటీ అధికారులు సంస్థకు చెందిన రికార్డుల్లో వ్యత్యాసాలు కనుగొన్నారని తెలుస్తోంది. అలాగే కంపెనీ నిర్మాణ వ్యాపారం నుంచి ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు నిధులను మళ్లించారని అనుమానిస్తున్నారు. 

ఇక, విజయవాడ, నెల్లూరులోని వైసీపీ నేత దేవినేని అవినాష్, సుబ్బారెడ్డి బంధువుల కార్యాలయాల్లో నాలుగు ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలోనే మూడు హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios