Asianet News TeluguAsianet News Telugu

పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు.. ఏదో జరిగిపోయిందని భ్రమలు కల్పించారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. ఐటీ అధికారులు గత మూడు రోజులుగా ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి నివాసం, ఆయనకు సంబంధించిన కంపెనీలతో పాటు పలుచోట్ల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

IT Raids Concluded in BRS MLA Pailla Shekar Reddy house ksm
Author
First Published Jun 17, 2023, 10:16 AM IST

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. ఐటీ అధికారులు గత మూడు రోజులుగా ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి నివాసం, ఆయనకు సంబంధించిన కంపెనీలతో పాటు పలుచోట్ల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డికి ఆర్థిక వ్యవహారాలపై దృష్టి సారించిన ఐటీ అధికారులు.. సోదాల్లో కీలక సమాచారం సేకరించినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డికి చెందిన కంపెనీలు ఆర్థిక లావాదేవీలు, రియల్ ఎస్టేట్ కార్యాకలాపాల వివరాలను సేకరించారు. అలాగే ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి బంధువుల వ్యాపార లావాదేవీలనూ కూడా పరిశీలించినట్టుగా సమాచారం. 

అయితే ఐటీ సోదాలపై స్పందించిన పైళ్ల శేఖర్ రెడ్డి.. బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేస్తూ ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రోజులుగా ఏదో జరిగిపోయిందని భ్రమలు కల్పించారని విమర్శించారు. ఐటీ అధికారులకు సోదాల్లో ఏం లభించకపోవడంతో నిరాశ, నిస్పృహలకు లోనయ్యారని అన్నారు. సోదాలు చేపట్టిన ఐటీ అధికారులకు అన్ని రకాలుగా సహకరించామన్నారు. వాళ్లు అడిగిన అన్ని వివరాలు అందజేశామని చెప్పారు. ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లారని.. అవసరమైతే రావాలని చెప్పారని అన్నారు.

కావాలనే తనపై బుదరజల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఐటీ అధికారుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందన్నారు. తాను, తన భార్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామని చెప్పారు. సక్రమంగా ఆదాయ పన్ను చెల్లిస్తున్నామని అన్నారు. రియల్ ఎస్టేట్, డెవలపింగ్ తప్ప తనకు ఏ వ్యాపారాలు లేవని  చెప్పారు. 1998 నుంచి వ్యాపారం చేస్తున్నామని.. తానెక్కడ తప్పుడు పనిచేయలేదని అన్నారు. ఎమ్మెల్యేలు వ్యాపారం చేయకూడదని ఎక్కడైన ఉందా? అని ప్రశ్నించారు. ఐటీ సోదాల వెనక ఎవరి హస్తం ఉందో అందరికి తెలుసునని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios