తెలంగాణ మంత్రివర్గ సహచరులు, బావబామ్మర్దులు హరీష్ రావు, కేటీఆర్ మధ్య సిద్దిపేట ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోో సరదాా సరదా సంబాషణలు సాగాయి.
సిద్దిపేట : బావ బామ్మర్దులు హరీష్ రావు, కేటీఆర్ ఒకరిపై ఒకరు సరదా పంచులు వేసుకున్నారు. తన బావను అప్పుడప్పుడు ఆటపట్టిస్తుంటానని కేటీఆర్ అంటే... బామ్మర్ది లాంటి ఐటీ మంత్రి ఏ రాష్ట్రంలో లేడని హరీష్ అన్నారు. ఇలా నిత్యం బిజీబిజీగా వుండే ఐటీ మంత్రి, ఆర్థిక మంత్రి సిద్దిపేట ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు సరదా కామెంట్స్ చేసుకున్నారు.
సిద్దిపేటలో వివిధ అభివృద్ది పనులతో పాటు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఐటీ టవర్ ను మంత్రులు హరీష్, కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... తామిద్దరం కేవలం మంత్రివర్గ సహచరులమే కాదు బావ బామ్మర్దులమని అన్నారు. అందువల్లే అప్పుడప్పుడు బావ హరీష్ ను సరదాగా ఏడిపిస్తుంటానని కేటీఆర్ అన్నారు. హరీష్ కూడా తనతో చాలా సరదాగా వుంటారని ఐటీ మంత్రి పేర్కొన్నారు.
తన నియోజకవర్గం సిరిసిల్లకు వెళ్లాలంటే సిద్దిపేట మీదుగానే వెళ్లాల్సి వుంటుందని... అందువల్ల తరచూ ఇక్కడికి వస్తుంటానని కేటీఆర్ తెలిపారు. వచ్చిన ప్రతిసారి ఏదో కొత్తగా కనిపిస్తుంటుంది... వెంటనే బావ(హరీష్) కు ఫోన్ చేస్తానని అన్నారు. ఏం సంగతి బావా! మళ్లీ ఏదో కొత్తగా కట్టినట్లున్నావ్... రోడ్లు వేసినట్లున్నావ్... అంటూ ఆటపట్టించేలా సరదాగా మాట్లాడుతుంటానని కేటీఆర్ అన్నారు.
Read More కేటీఆర్ వంటివారినే అందరూ కోరుకుంటున్నారు...: హరీష్ రావు ఆసక్తికర కామెంట్స్
హరీష్ రావు కూడా ఈసారి వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని పో...ప్రతిసారి ఏదో ఒకటి అంటున్నావు అంటుంటాడని కేటీఆర్ తెలిపారు. ఇలా తమ మధ్య సరదా సంబాషణలు సాగుతుంటాయని ఐటీ మంత్రి పేర్కొన్నారు. నిజంగానే తాను సిరిసిల్లకు వెళ్లే ప్రతిసారి సిద్దిపేట సరికొత్తగా కనిపిస్తుంటుందని... ఏదో అభివృద్ది పనులు జరుగుతుంటాయని కేటీఆర్ అన్నారు. తన బావ హరీష్ సిద్దిపేటను అద్భుతంగా అభివృద్ది చేస్తున్నాడని కేటీఆర్ కొనియాడాడు.
సిద్దిపేట అభివృద్దికి కృషిచేస్తున్న హరీష్ రావు ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ అన్నారు. ప్రతిసారి రికార్డ్ మెజారిటీ అందిస్తూ గెలిపిస్తున్న ప్రజలు ఈసారి మాత్రం అందరూ అసూయపడేలా అద్భుత విజయం అందించాలని కోరారు. ఈసారి హరీష్ రావును లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని కేటీఆర్ కోరారు.
ఇక బిఆర్ఎస్ ప్రభుత్వానికి సిద్దిపేట మీద ప్రత్యేక ప్రేమ ఎందుకు అని చాలామంది తనను అడుగుతున్నారని... ఆ ప్రశ్నకు ఇదే గడ్డపైనుండి సమాధానం చెబుతానని కేటీఆర్ అన్నారు. ఉద్యమ నాయకుణ్ణి అందించింది ఈ సిద్ధిపేట గడ్డే... ఇక్కడ కేసీఆర్ పుట్టకుంటే తెలంగాణ ఉద్యమం పుట్టేదా..స్వరాష్ట్రం వచ్చేదా.. అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకున్ని అందించిన సిద్దిపేటపై ప్రభుత్వం కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
