తెెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పై ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రశంసలు కురిపించారు.
సిద్దిపేట : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను ఆర్దిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కొనియాడారు. కేటీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని... ఆయనలా పనిచేసే ఐటీమంత్రి ఏ రాష్ట్రంలో లేరన్నారు. అందువల్లే కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టర్ తమ రాష్ట్రాల్లో కూడా వుండాలని యువత కోరుకుంటోందన్నారు. తెలంగాణలో ఐటీ రంగాన్ని కేటీఆర్ పరుగులు పెట్టిస్తున్నారని హరీష్ పేర్కొన్నారు.
హరీష్ సొంత నియోజకవర్గం సిద్దిపేటలో నిర్మించిన ఐటీ టవర్ ను ఇవాళ కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ... కలలో కూడా సిద్దిపేటకి ఐటీ టవర్ వస్తుందని అనుకోలేదని అన్నారు. సిద్దిపేట జిల్లా అయ్యిందన్నా, ఇక్కడ ఐటీ టవర్ నిర్మాణం జరిగిందన్నా అందుకు తెలంగాణ తెచ్చిన కేసీఆరే కారణమన్నారు. సిద్దిపేటలో పుట్టి, ఇక్కడే చదివిన బిడ్డలకు ఇప్పుడు ఇక్కడే ఐటీ ఉద్యోగాలు చేసుకునే అవకాశం దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో మంత్రి కేటీఆర్ సహకారంతో మరికొన్ని పరిశ్రమలు సిద్దిపేటకు తీసుకువస్తామని హరీష్ అన్నారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ అభివృద్దిపై చాలా అనుమానాలు వ్యక్తం చేసారు... అలాంటివారే ఇప్పుడు అభివృద్ది చూసి ఆశ్చర్యపోతున్నారని అన్నారు. ఆనాడు ఉద్యమనేత కేసీఆర్ ని తిట్టిన నోళ్లే ఇప్పుడు విజనరీ ముఖ్యమంత్రి అని మెచ్చుకుంటున్నాయని అన్నారు. విజన్ 2020 అన్నారు..హైటెక్ అన్నవాళ్లతో కానిది సీఎం కేసీఆర్ చేసి చూపించారని హరీష్ పేర్కొన్నారు.
Read More సిద్దిపేటలో స్లాటర్ హౌస్‌ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు
దేశ ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో పరిశ్రమలకు పవర్ హాలిడే ఇస్తున్నారని హరీష్ అన్నారు. కానీ తెలంగాణలో పరిశ్రమలకే కాదు వ్యవసాయానికి కూడా 24 గంటల నిరంతరాయ కరెంట్ ఇస్తున్నామని అన్నారు. యావత్ దేశం ప్రస్తుతం తెలంగాణ వైపు చూస్తోందని... మనం ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుందని అన్నారు. మరోసారి బిఆర్ఎస్ పార్టీని గెలిపించి కేసీఆర్ ని హ్యాట్రిక్ సీఎం చేయాలని మంత్రి హరీష్ సూచించారు.
