అప్పుడప్పుడు వైద్యం వికటించడం సహజమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక్కరు చేసిన పొరపాటుకు మొత్తం వ్యవస్థను నిందించడం సరికాదని ఆయన తెలిపారు.
అప్పుడప్పుడు వైద్యం వికటించడం సహజమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. దీనికి వైద్యులే కారణం కాదని, సిబ్బంది వల్ల కూడా తప్పు జరగొచ్చని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాశంగా మారాయి. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు.
స్వయంగా జిల్లాలో మంచి కంటి డాక్టర్ గా పేరున్న సంజయ్ కుమార్.. ఒకటి, రెండు ఘటన వల్ల గవర్నమెంట్ హాస్పిటల్స్ పై ఉన్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకోకూడదని సూచించారు. ఓ మహిళ కడుపులో గుడ్డ అలాగే ఉంచి ఆపరేషన్ పూర్తి చేశారన్న ఘటన రెండు సంవత్సరాల కిందట జరిగిందని తెలిపారు. కానీ తాజాగా పేపర్లలో వస్తుందని చెప్పారు.
కింది స్థాయిలో ఒకరు చేసిన తప్పుకు వ్యవస్థను మొత్తం నిందించకూడదని ఎమ్మెల్యే అన్నారు. వైద్యులు, నర్సుల అందరి సమక్షంలో, అందరి బాధ్యతతోనే సర్జరీలు జరుగుతాయని తెలిపారు. ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్స్ పై నమ్మకంతో రావాలని ఆయన కోరారు. ఉచితంగా వైద్యాన్ని చేయించుకోవాలని సూచించారు.
ట్విట్టర్ లో బ్లూ టిక్ కోల్పోయిన యోగి ఆదిత్యనాథ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఖాతాలు.. ఎందుకంటే ?
ఇదిలా ఉండగా.. గతవారం జగిత్యాల డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ లో వెలుగులోకి వచ్చిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. కొడిమ్యాల మండలానికి చెందిన నవ్యశ్రీకి జగిత్యాల హాస్పిటల్ లో 16 నెలల కిందట కాన్పు జరిగింది. అయితే ఆమెకు సిజేరియన్ చేసి, కుట్లు వేసే సమయంలో డాక్టర్లు ఓ గుడ్డను కడుపులోనే వదిలివేశారు. అయితే సంవత్సరం తరువాత ఆమెకు కడుపునొప్పి వచ్చింది. దీంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు ఆమె స్కానింగ్ చేయించుకున్నారు. అయితే అందులో కడుపులో క్లాత్ ఉన్నట్టు తేలింది. వెంటనే ఆపరేషన్ చేసి ఆ క్లాత్ ను డాక్టర్లు తీసివేశారు. ఈ మొత్తం ఘటనను వివరిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆ జిల్లా డీఎంహెచ్ వో కు లేఖ రాశారు.
