తెలంగాణాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజుకి దాదాపుగా 3000 నుంచి 4000 మధ్య పరీక్షలు నిర్వహిస్తే దాదాపుగా 1000 కేసులు బయటపడుతున్నాయి. అంటే... టెస్ట్ చేసిన ప్రతి ముగ్గురిలో లేదా నలుగురిలో ఒకరికి కరోనా ఉన్నట్టు. 

ఈ స్థాయిలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో.... హై కోర్టు, కేంద్రం, ప్రతిపక్షాలు అన్నీ కూడా తెరాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కేంద్ర బృందం కూడా హైదరాబాద్ లో పర్యటించింది. తెలంగాణ ప్రభుత్వం పై కేంద్ర బృందం అసంతృప్తిని కూడా వ్యక్తం చేసింది. 

ఇక తెలంగాణాలో నమోదవుతున్న కేసుల్లో అధిక కేసులు హైదరాబాద్ పరిధిలో నమోదవుతున్నాయి. రోజు వారి కేసుల్లో అత్యధికం 90 శాతానికి పైన్నే గ్రేటర్ పరిధిలోనివి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ మరల విధిస్తున్నారు అనే చర్చ మొదలయింది. 

తొలుత జూన్ 1 నుండి ఉంటుందని అన్నారు. ఆ తరువాత జూన్ 3వ తారీఖు నుండి ఉంటుందని అన్నారు. కాబినెట్ మీటింగ్ తరువాత అని అన్నారు. కాబినెట్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందో ఇప్పటివరకు సమాచారం లేదు. 

ఈ నేపథ్యంలో అందరూ కూడా హైదరాబాద్ లో లాక్ డౌన్ ఎప్పటి నుండి అనే ఆలోచనలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు హైదరాబాద్ లో లాక్ డౌన్ ఉంటుందా, ఉంటే అది ఎప్పటి నుండి  అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. 

ఇలా చర్చలు జరుగుతుండగానే అన్ లాక్ 2.0 అమల్లోకి వచ్చింది. కేవలం రాత్రి మాత్రమే కర్ఫ్యూ విధించారు. ఇక మద్యం షాపులను అయితే ఏకంగా రాత్రి 9.30 వరకు పెంచేశారు. చూడబోతుంటే... లాక్ డౌన్ అటుంచితే మరిన్ని సడలింపులు ఇస్తుంది. 

ఇక దీనితోపాటుగా తెలంగాణాలో టెస్టింగ్ కేంద్రాలను పెంచారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాల అనుసారం ఉచిత టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు. ప్రైవేట్ డాక్టర్ చిట్టి ద్వారా కూడా కరోనా టెస్టులను నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పింది. 

చూడబోతుంటే... హైదరాబాద్ లో లాక్ డౌన్ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా కనబడుతుంది. షాపుల సమయాన్ని పెంచడం, వైన్ షాపులు తెరిచి ఉంచే సమయాన్ని కూడా పెంచడం అన్ని చూస్తుంటే... లాక్ డౌన్ విధించే విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు కనబడుతుంది.