Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు, జగన్, పవన్ కు కోదండరాం ఝలక్

పనిలో పనిగా కేసిఆర్ నూ ఇరికించిండా ?
Is kodandaram opposed to special status to Andhra

తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం సీమాంధ్ర నేతల మీద పెద్ద బాంబే వేశారు. ఎపికి ప్రత్యేక హోదా పేరుతో రకరకాల పద్ధతుల్లో ఆందోళన చేస్తున్న పార్టీలన్నింటినీ వాయించారు. ఎపికి ప్రత్యేక హోదా సాధ్యమయ్యే పనే కాదని తేల్చిపారేశారు. అంతేకాదు ఎపికి ప్రత్యేక హోదా పేరుతో ఆంధ్రా రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేయడం మాని కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు రాబట్టేందుకు ఆంధ్ర పార్టీలు ప్రయత్నం చేయాలని సలహా ఇచ్చారు.

తెలంగాణ జెఎసి ఛైర్మన్, తెలంగాణ జన సమితి నేత ప్రొఫెసర్ కోదండరాం ఎపికి ప్రత్యేక హోదాపై స్పందించారు. ఎపికి ప్రత్యేక హోదా సాధ్యమయ్యే ప్రసక్తే లేదని తేల్చి పారేశారు. అయితే గత కొంత కాలంగా ఎపికి ప్రత్యేక హోదా పేరుతో సీమాంధ్రలో రాజకీయ పార్టీలన్నీ తమకు తోచిన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక పార్టీపై మరో పార్టీ గుట్టలు గుట్టలుగా బురద  చిమ్ముకుంటున్నాయి. ఎపికి ప్రత్యేక హోదా విషయంలోనే బిజెపి, టిడిపి బంధం పటక్కున తెగిపోయింది. ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి హోదా కోసం ఎందాకైనా వెళ్తానని ప్రకటించారు. దీక్ష చేసి ప్రాణాలైనా అర్పిస్తానని స్పష్టం చేశారు. ఇక వైసిపి అధినేత జగన్ కూడా తనదైన శైలిలో టిడిపిని ఇరుకునపెట్టేందుకు ఎత్తుడలు, వ్యూహాలు పన్నుతున్నారు. తన ఎంపిల చేత జగన్ రాజీనామా చేయించారు. రోజుకో ఆందోళనతో ఎపిలో రాజకీయ పార్టీలు అలజడి రేపుతున్నాయి. అంతేకాదు పార్లమెంటులోనూ ఆందోళనలు గట్టిగానే చేశారు ఎపి నేతలు. 

ఈ పరిస్థితుల్లో ఎపి ప్రత్యేక హోదాపై తెలంగాణ జన సమితి నేత కోదండరాం స్పందించారు. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తే రాయితీలు ఎక్కువగా ఉంటాయని తద్వారా పెట్టుబడులన్నీ ఎపికే వెళ్తాయన్నారు. దాంతో తెలంగాణతో సహా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు నష్టం చేకూరే ప్రమాదముందని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు ఎపిలో కేవలం రాజధాని ప్రాంతమైన అమరావతిలోనే అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారని, ఇది మంచి పరిణామం కాదన్నారు కోదండరాం. అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించాలన్నారు. 

కేసిఆర్ కూ కాక పుట్టించాడా ?
ఎపికి ప్రత్యేక హోదా పేరుతో పార్లమెంటులో జరిగిన ఆందోళనకు టిఆర్ఎస్ సైతం మద్దతు పలికింది. కేసిఆర్ కుమార్తె ఎంపి కవిత ప్రత్యేక హోదాకు మా మద్దతు ఇస్తామని పార్లమెంటులో ప్రకటించారు. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తూనే తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ పంతులు కోదండరాం ఎపి ప్రత్యేక హోదాకు వ్యతిరేకమైన స్టాండ్ తీసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆయన ఏక కాలంలో ఒక్క ప్రకటనతో ఇటు కేసిఆర్ ను, అటు సీమాంధ్ర రాజకీయ నేతలను డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం చేశారన్న చర్చ మొదలైంది. 

తెలంగాణ కాంగ్రెస్ కూ చురకలు తప్పలేదా?

ఇటీవల తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీమాంధ్రులకు తెలంగాణలో టికెట్లు ఇస్తామని ప్రకటనలు చేశారు. హైదరాబాద్ లో మరిన్ని సీట్లు ఇస్తామన్నారు. అయితే తెలంగాణలో సెటిలైన సీమాంధ్ర ఓట్ల కోసమే ఈ  ప్రకటనలు చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరి ఒకవైపు కేసిఆర్ రకరకాల వ్యూహాలతో సీమాంధ్ర ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుండగా, ఇంకోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా సీమాంధ్ర ఓట్ల కోసం ఆరాటం చేస్తున్నది. అలాంటప్పుడు ఉన్నఫలంగా కోదండరాం ఎపి ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా లైన్ తీసుకోవడం చూస్తే తెలంగాణ ప్రజలకు సిసలైన ప్రతినిధి తెలంగాణ జన సమితి మాత్రమే అన్న ఇంప్రెషన్ ఇచ్చే ఉద్దేశం ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆంధ్రా ఓట్ల కోసం ఆంధ్రా పార్టీలు ప్రయత్నం చేస్తుండగా తెలంగాణలో సెటిలైన సీమాంధ్ర ఓట్ల కోసం ఇటు టిఆర్ఎస్, అటు ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో కోదండరాం ఈ బాంబు పేల్చారు. మొత్తానికి కోదండరాం ఎపి ప్రత్యేక హోదా పాచిక ఏమేరకు పారుతుందన్ని చూడాలి.

చట్టాన్ని అమలు చేయమంటే సరిపోతదిగా ?

ఎపికి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న విషయమై కోదండరాం ఏషియానెట్ తో మాట్లాడారు. ఎపికి ప్రత్యేక హోదా కోరే కంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అమలు చేయాలని ఆంధ్రా పార్టీలు కోరితే సరిపోతుంది కదా అన్నారు. ఆంధ్రకు స్పెషల్ స్టేటస్ ఇచ్చే అవకాశమేలేదన్నారు. విభజన చట్టంలో హోదాలో మాదిరే చాలా రాయితీలు ప్రకటించారు. హోదా కొన్ని ప్రత్యేక అభివృద్ధి నిరోధక సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల ఇచ్చేది. ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల కోవలోకి రాదు. ప్రత్యేక హోదాతో సమానమైన అంశాలన్నీ విభజన చట్టంలో ఉన్నాయని, ఆ చట్టాన్ని అమలు చేయాలని కోరితే సరిపోతుంది కదా? అని కోదండరాం వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios