తెలంగాణ సర్కారుపై ఒంటికాలు మీద లేచి విరుచుకుపడుతున్న రేవంత్ రెడ్డిని కట్టడి చేసేందుకు తెలంగాణ సర్కారు మరోసారి నడుం బిగించిందా? రేవంత్ ముప్పేట దాడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఖతర్నాక్ ప్లాన్ వేసిందా? రేవంత్ రెడ్డి నోరు మూపించడమే లక్ష్యంగా సర్కారు అడుగులు వేస్తోందా?  మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి? తెలంగాణలో ఏం జరుగుతున్నది? తెలియాలంటే.. ఈ స్టోరీ చదవండి మరి.

పరుశమైన పదజాలంతో ఎవరు దూషించినా కోర్టు అనుమతితో సంబంధం లేకుండానే కేసు పెట్టి అరెస్టు చేసే వెసులుబాటును తెలంగాణ సర్కారు చట్ట సవరణ ద్వారా తీసుకుంది. ఇకపై ఎవరైనా రాజకీయ నాయకులు కానీ, వ్యక్తులు కానీ పరుషమైన భాషలో తిట్లు, ధూషణలు చేస్తే వారిపై వెంటనే కేసు నమోదు చేయడమేకాదు కోర్టు అనుమతి అవసరం లేకుండానే అరెస్టు చేసి బొక్కలో వేయవచ్చు. ఇందుకోసమే సెక్షన్ 506, 507 లను కోర్టు అనుమతి నుంచి మినహాయిస్తూ చట్ట సవరణ చేశారు. ఆ చట్ట సవరణ ఫైలు మీద ముఖ్యమంత్రి కేసిఆర్ సంతకం కూడా చేసేశారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తిట్ల రాతలు, పరుషమైన రాతలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో సర్కారు ఈ చట్టాన్ని సవరించినట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొందరు సర్కారు మీద పరుషమైన పదజాలంతో, బూతుమాటలతో ధూషణలకు దిగుతున్నారు. ఆ మాటల తాలూకు పోస్టులను వైరల్ చేస్తున్నారు. అలాగే మరికొందరు.. విపక్ష పార్టీల మీద కూడా అదే తరహాలో మాటల దాడి చేస్తున్నారు. ఆ పోస్టులను సైతం వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి బూతు మాటలతో కూడిన పోస్టులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సర్కారు భావిస్తోంది. దానికోసమే కోర్టు అనుమతి నుంచి 506, 507 సెక్షన్ల నుంచి మినహాయింపు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. గడిచిన మూడున్నరేళ్లుగా టిడిపిలో ఉన్నా.. కాంగ్రెస్ లో ఉన్నా రేవంత్ రెడ్డి సర్కారు మీద ముప్పేట దాడి చేస్తున్నారు. ఆయన ఒకవైపు సర్కారు వైఫల్యాలను తీవ్రంగా విమర్శిస్తూనే.. మరోవైపు అంతే వేగంగా.. సర్కారు పెద్దలను ధూషిస్తున్నారు. తిట్ల దండకం అందుకుంటున్నారు. గలీజు మాటలతో అధికార పార్టీ నేతలను అవమానిస్తున్నారు. దీంతో సర్కారుకు రేవంత్ తీరు చిరాకు తెప్పించినట్లు చెబుతున్నారు. విమర్శల వరకు సహించవచ్చు కానీ.. రేవంత్ అస్తమానం బండబూతులు తిడితే ఎవరు మాత్రం సహిస్తారు అని టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక కీలక నేత చెప్పారు. ముఖ్యమంత్రిని రేవంత్ వాడు వీడు అని సంబోధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారాయన. బాధ్యత కలిగిన మంత్రులను సైతం వాడు, వీడు, బోషిడీకే అంటూ రేవంత్ తిట్ల పురాణం వినలేక చెవులు పలిగిపోతున్నాయని బాధపడ్డారు. అందుకే సర్కారు కఠినమైన చట్టాన్ని ముందుకు తెచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే ఈ చట్ట సవరణ చేసిన తర్వాత ఒకవేళ రేవంత్ రెడ్డి సైలెంట్ అయి కేవలం పార్లమెంటరీ భాషలోనే మాట్లాడినా సరే పాత తిట్లను బటయకు తీసి.. వాటి ఆధారంగా కేసులు నమోదు చేసి జైళ్లో వేస్తారన్న ప్రచారం కూడా ఇప్పటికే మొదలైంది. గతంలో కేసిఆర్, కేటిఆర్ లపై రేవంత్ విమర్శలు చేశారు. కేటిఆర్ తనయుడు హిమాన్ష్ ను సైతం చిట్టి నాయుడు అంటూ ధూషించారు. పందుల పెంపంకం చేపట్టాలంటూ ఎద్దేవా చేశారు. అలాగే మంత్రి లక్ష్మారెడ్డిని బోసిడికే అన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిని సైతం ధూషించారు. ఈ నేపథ్యంలో పాత అంశాలను బయటకు తెచ్చి రేవంత్ మీద కేసు నమోదు చేసి మరోసారి జైలులో వేసే చాన్స్ ఉందేమో అని పాలమూరుకు చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు అనుమానం వ్యక్తం చేశారు. ఈ చట్టమే రేవంత్ ను కంట్రోల్ చేసేందుకు తెచ్చినట్లుందని ఆయన కామెంట్ చేశారు.

రేవంత్ రెడ్డి తెలంగాణ వచ్చినప్పటి నుంచి టిఆర్ఎస్ సర్కారుకు కొరకరాని కొయ్యగా తయారైండన్న వాదన ఉంది. అసెంబ్లీలోనే సిఎం ముందే అసమర్థ సిఎం అంటూ సంబోధించారు. ఆ సమయంలో రేవంత్ అసెంబ్లీలో సర్కారును ఇరకాటంలోకి నెడుతున్నాడని, విద్యుత్ మీద తప్పుడు లెక్కలు చెబుతున్నాడంటూ గడిచిన మూడున్నరేళ్ల కాలంలో సెషన్ల కొద్దీ రేవంత్ మీద సస్పెన్షన్ వేటు వేసిన సందర్భాలున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డిని ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నామంటూ ఆదేశాలు ఇచ్చిన దాఖలాలున్నాయి. ఒక సందర్భంలో అయితే ఎంపి కవితపై అవాకులు చెవాకులు పేలావంటూ రేవంత్ ను మాట్లాడకుండా చేసింది అధికారపక్షం. దీంతో రేవంత్ వల్లే సభలో అలజడి అంటూ ఆయనను సెషన్ మొత్తం సస్పెండ్ చేసింది. ఇక లోపల సస్పెండ్ చేస్తున్నారని గ్రహించిన రేవంత్ కూడా కొద్దిగా స్టాండ్ మార్చారు. అసెంబ్లీ లోపల పరుష పదాలు వాడకుండా ప్రసంగించేవారు. కానీ.. బయటకు వచ్చి మీడియా పాయింట్ లో తిట్ల పురాణం అందుకున్న పరిస్థితి ఉంది.

ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఇటీవల సర్కారు మీద చేసిన విమర్శలకు పాలకపక్షం నుంచి జవాబు రాలేదు. అందులో కీలకమైనవాటిలో కేటిఆర్ మామ ఎస్టీ సర్టిఫికెట్ తో జాబ్ కొట్టేశారన్నది ఒకటి కాగా.. కేటిఆర్ అసలు పేరు అజయ్ రావు అని రేవంత్ వెల్లడించారు. అలాగే విద్యుత్ విషయంలో సర్కారుపై సవాల్ చేసి సర్కారును ఇరకాటంలో పడేశారు. బాల్క సుమన్ ఈ విషయంలో వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది. అంతేకాదు మంత్రి లక్ష్మారెడ్డిని తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టి పడేశారు. తిట్లు, విమర్శలు ఇలా రెండు వైపులా రేవంత్ రెచ్చిపోతున్నాడన్న ఉద్దేశంతో ఈ చట్ట సరవణ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

మరి తెలంగాణలో టిఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నోటికి అడ్డూ అదుపు లేకుండా తిట్లు తిట్టింది. ఉద్యమ నేత కేసిఆర్ నాటినుంచి నేటి వరకు ఏనాడూ నోరు మూసిన దాఖలాలు లేవు. తుదకు సహచర ఉద్యమ నేత కోదండరాం ను సైతం గౌరవమైన ప్రొఫెసర్ అనే విషయాన్ని పక్కనపెట్టి వాడు, వీడు, లంగా అంటూ ధూషించిన దాఖలాలున్నాయి. చవటలు, సన్నాసులు, దద్దమ్మలు, చెంచాలు, లుచ్చాలు, లత్కోర్లు, లఫంగాలు, పోరంబోకులు, ఫాల్తుగాళ్లు ఇలాంటి పదాలను రాజకీయాలకు పరిచయం చేసిందే టిఆర్ఎస్ వాళ్లు అన్న విమర్శ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఈ చట్ట సవరణ ఏరకంగా ప్రజలకు మేలు చేకూరుస్తుందన్నది ఆశ్యర్యంగా ఉంది. కేవలం కొందరిపై కక్ష సాధింపు కోసమేనా అన్న అనుమానాలైతే కలుగుతున్నాయి.