ఉద్యోగాలు గోరంత... ఉద్యమం కొండంత

First Published 7, Feb 2017, 9:47 AM IST
is govt notification effect on february 22 rally
Highlights

గుప్పెడు ఉద్యోగ ప్రకటనలు కొండంతగా పెరుగుతున్న ఉద్యమాన్ని ఆపుతాయా...?

 

 

నిరుద్యోగ నిరసన ర్యాలీ ప్రకటన అప్పుడే ప్రభుత్వ పాలకుల్లో ప్రకంపనలు సృష్టించిందా... ఇదుగో నోటిఫికేషన్లు అంటూ ఏడాదిగా ఊరించిన సర్కారు ఇప్పుడే ఎందుకు హడావిడిగా నియామక ప్రకటనలు విడుదల చేసింది.

 

22\2 ప్రభావమా.. లేక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యమా.. ఈ రెండు కారణమా...

 

ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం నుంచి చాలా రోజుల తర్వాత ఓ నోటిఫికేషన్ మాత్రం వచ్చింది. అంతమాత్రాన నిరుద్యోగులంతా సంబరపడి పుస్తకాలతో కుస్తీపడుతున్నారనుకుంటే పొరపాటే.

 

గతంలో నోటిఫికేషన్లు విడుదల చేసిన కొన్ని పోస్టులకు ఇప్పటివరకు నియామకాలే పూర్తికాలేదు. సాంకేతిక సమస్యలు, కోర్టు వివాదాలతో ఉద్యోగాల నియామకం సాగుతూనే ఉంది.

 

ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి దాదాపు 24 నోటిఫికేషన్స్ వస్తే  నియామకమైన ఉద్యోగాలు కేవలం 5 వేలు.

 

ఇక కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 10 వేల పోస్టులు భర్తీకి పరీక్షలు పూర్తైనా ఇప్పటివరకు ఫలితాలు రాలేదు. మరోవైపు గ్రూప్ 1, గ్రూప్ 2 ల పరిస్థితి అలానే తయారైంది.
 

నిన్న ప్రకటించిన గురుకుల టీచర్ల నియామక ప్రకటన వల్ల కూడా తెలంగాణ యువతకు పెద్దగా లాభించేది ఏమీ లేదు. 7 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసినా అదేమీ కేవలం డిగ్రీ చేసిన వారితో నియమించే పోస్టులు కావు. బీఎడ్ చేయాలి, టెట్ అర్హత సాధించాలి, పీజీ లో 50 శాతం మార్కులు దాటాలి. ఇలా సవాలక్ష షరతులున్నాయి.

 

పైగా ప్రకటించిన పోస్టుల్లో 75 శాతం అంటే 5 వేల పై చిలుకు పోస్టులు మహిళలకే కేటాయించారు. మరోవైపు జోనల్ స్థాయిలో వివిధ సబ్జెక్టుల వారిగా పోస్టులను విభజిస్తే అర్హలైన అభ్యర్థులు కూడా కళ్లు తేలేస్తున్నారు. కొన్ని సబ్జెక్టులలో రెండంకెల పోస్టులు కూడా లేవు.  

 

మరో వైపు డీఎడ్ చేసిన వారికి కొన్ని పోస్టులకు అర్హత లేకుండా చేశారు. ఇక కేవలం డిగ్రీ చేసిన వారు ఈ నోటిఫికేషన్లలో ఏ పోస్టుకు అర్హత లేదు. రాష్ట్రంలో వారి సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది.

 

నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అందరూ అర్హులుగా ఉండే ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాల్సి ఉండేది. కానీ, టీ జేఏసీకి చెక్ పెట్టాలనో, నిరసన ర్యాలీని ఉద్యోగ ప్రకటనతో అడ్డుకోవచ్చని ఇలాంటి పని చేయడం వల్ల ఏవరికి ఏ ఉపయోగం లేదని నిరుద్యోగుల వాదిస్తున్నారు.

 

ఫిబ్రవరి 22 న జరిగే నిరుద్యోగ నిరసర ర్యాలీ పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని అంటున్నారు. అదే జరిగితే ఉద్యమ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టే.

 

loader