తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు  చేస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తిప్పి పంపిన బిల్లులపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే  అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తిప్పి పంపిన బిల్లులపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను పెండింగ్‌లో పెడుతున్నారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన తాజా విచారణలో గవర్నర్ వద్ద ఎలాంటి పెండింగ్ బిల్లులు లేవని.. కొన్ని బిల్లులను తిప్పి పంపారని గవర్నర్ తరఫున సొలిటర్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. 

తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపిస్తూ.. ప్రజలచే ఎన్నికల ప్రభుత్వం గవర్నర్‌ దయకోసం చూడాల్సి వస్తోందని చెప్పారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు రాజ్యాంగంలోని 200 (1) అధికరణ ప్రకారం బిల్లులను వీలైనంత త్వరగా క్లియర్‌ చేయాలని సూచించింది. ప్రస్తుతం పెండింగ్‌లో బిల్లులు లేనందున కేసును ముగిస్తున్నట్లుగా తెలిపింది. 

ఇక, గవర్నర్ తిప్పి పంపిన వాటిలో తెలంగాణ మున్సిపల్ చట్టం (సవరణ) బిల్లు, తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టం (సవరణ) బిల్లులు ఉన్నాయి. మరోవైపు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు (స్థాపన, నియంత్రణ) (సవరణ) బిల్లు, పంచాయితీ రాజ్ (సవరణ) బిల్లులపై గవర్నర్ మరింత వివరణ కోరారు. అయితే బిల్లులపై చర్చలు జరిపేందుకు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. బిల్లులపై చర్చించి.. ఒకవేళ అవసరం అనుకుంటే సవరణలు చేసి తిరిగి గవర్నర్ ఆమోదానికి పంపనుంది. 

అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం.. ప్రభుత్వం పంపిన బిల్లు ద్రవ్య బిల్లు కాకపోతే గవర్నర్ దానిని తిరిగి పంపే అధికారం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. బిల్లును ప్రభుత్వానికి తిప్పి పంపిన సమయంలో.. బిల్లును లేదా ఏదైనా పేర్కొన్న వాటిని పునఃపరిశీలించాలని అభ్యర్థిస్తున్న సందేశాన్ని గవర్నర్ పొందుపరచవచ్చు. అయితే ఆ తర్వాత సవరణతో గానీ, సవరణ లేకుండా గానీ అసెంబ్లీ బిల్లును మళ్లీ ఆమోదించినట్లయితే.. గవర్నర్ అనుమతిని నిలుపుదల చేయరాదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.