టిఆర్ఎస్ లో ఇమడలేకపోతున్న డిఎస్ స్వేచ్ఛ లేదన్న భావనలో డిఎస్ ఫ్యామిలీ చిన్న కొడుకు అర్వింద్ బజెపి గూటికి దిల్ రాజు రాక పట్ల డిఎస్ ఫ్యామిలీ టెన్షన్ టిఆర్ఎస్ సభ్యత్వాలను రెనివల్ చేయించుకోని ఇద్దరు కొడుకులు
ధర్మపురి శ్రీనివాస్ (డిఎస్) గులాబీతోటలో ఇమడలేకపోతున్నారా? డిఎస్ త్వరలోనే టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధమైందా? డిఎస్ కంటే ముందే ఆయన కొడుకులు గులాబీ గూటి నుంచి జంప్ కానున్నారా? ఇంతకీ డిఎస్ ఇద్దరు కొడుకుల పయనమెటు? టిఆర్ఎస్ లో డిఎస్ కుటంబానికి వచ్చిన నష్టమేమిటి? కష్టమేంటి? ఈ వివారాలన్నీ తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగారు. రెండుసార్లు పిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గౌరవించింది. అయినా ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత అనూహ్య నిర్ణయం తీసుకుని గులాబీ గూటిలో చేరిపోయారు. ఎన్ని విమర్శలొచ్చినా, ఇంటా బయటా ఎంతగా వ్యతిరేకత వచ్చినా పిసిసి మాజీ అధ్యక్షుడిగా ఉన్న ఆయనను టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు కెసిఆర్. తొలుత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా, తర్వాత రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ. అప్పటికే డిఎస్ సామాజిక వర్గానికి చెందిన కేశవరావు ఉన్నప్పటికీ టిఆర్ఎస్ సాహసం చేసి డిఎస్ ను రాజ్యసభకు పంపింది.
కానీ డిఎస్ కుటుంబం టిఆర్ఎస్ లో నిమ్మలంగా లేనట్లు కనబడుతున్నది. తీవ్రమైన అసంతృప్తితో ఆ ఫ్యామిలీ ఉన్నట్లు చెబుతున్నారు. నిజామాబాద్ లో డిఎస్ ఫ్యామిలీ పలుకుబడి పూర్తిగా తగ్గిపోయిందన్న ఆవేదనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు సిఎం కుమార్తె కవిత ఎంపిగా నిజామాబాద్ లోనే ఉండడం కూడా డిఎస్ కుటుంబం హవా సాగడంలేదన్న ప్రచారం ఉంది. ఇక డిఎస్ కుటుంబం ప్రస్తుతం టిఆర్ఎస్ ను వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు జోరుగా పార్టీ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.
ప్రొడ్యూసర్ దిల్ రాజు టిఆర్ఎస్ లో చేరతాడన్న ప్రచారం మొదలైన నాటినుంచి డిఎస్ ఫ్యామిలీ దూరం జరగడం షురూ అయిందని చెబుతున్నారు. ఇటీవల కాలంలో దిల్ రాజు ఫిదా సినిమా ఉత్సవాలను నిజామాబాద్ లో అట్టహాసంగా జరిపారు. దీంతో దిల్ రాజు టిఆర్ఎస్ లో చేరడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. దిల్ రాజు టిఆర్ఎస్ లో చేరితే ఆయనకు వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ సీటు కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే దిల్ రాజు సొంత గ్రామం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఉంటుంది. ఒకవేళ దిల్ రాజుకు జహీరాబాబాద్ పార్లమెంటు సీటు కానీ, నిజామాబాద్ అర్బన్ సీటు కానీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.
దిల్ రాజు టిఆర్ఎస్ గూటికి చేరితే డిఎస్ కుటుంబానికి చెక్ పడ్డట్లే అన్న ఆందోళన డిఎస్ ఫ్యామిలీలో ఉంది. రానున్న ఎన్నికల్లో డిఎస్ పెద్ద కొడుకు సంజయ్, చిన్న కొడుకు అర్వింద్ ఇద్దరూ ఎన్నికల బరిలోకి దిగేందుకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో డిఎస్ కు ఇప్పటికే రాజ్యసభ ఇచ్చినందున ఇక ఆ ఫ్యామిలీలో ఎమ్మెల్యే సీట్లు ఇస్తారో లేదోనన్న ఆందోళన నెలకొంది. దీంతోనే డిఎస్ చిన్న కొడుకు అర్వింద్ బిజెపి వైపు చూస్తున్నారు. త్వరలోనే అర్వింద్ బిజెపి తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది. అందుకే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అర్వింద్ భారీగా ఖర్చు పెట్టి పత్రికా ప్రకటనలు గుప్పించారు. ఇంగ్లీషు, తెలుగు పత్రికల్లో యాడ్స్ ఇచ్చాడు. సుమారు 50 లక్షల వరకు యాడ్స్ కోసమే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

డిఎస్ టిఆర్ఎస్ లో కొనసాగేది అనుమానమే అనే వదంతలు వస్తున్నపుడు , ఆయన చిన్న కొడుకు అర్వింద్ మోడీని పొగుడుతూ పేపర్ యాడ్స్ ఇచ్చి సంచనలం సృష్టించాడు. దీనితో డిఎస్ కుటుంబం టిఆర్ ఎస్ ను వీడి వేరే దారి చూసుకుంటునే వార్తలు నిజమేనా అనిపిస్తుంది. మరోవైపు డిఎస్ కాంగ్రెస్ గూటికి తిరిగి వెళ్తారని ఇటీవలకాలంలో జోరుగా ప్రచారం సాగింది. ఆయన టిఆర్ఎస్ లో నెగలలేని స్థితిలో ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో పిసిసి అధ్యక్షుడి హోదాలో అనేకసార్లు మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ ఉండేదని, ఇప్పుడు మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండాపోయిందని ఆయన తన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో డిఎస్ కాంగ్రెస్ గూటికి మళ్లీ వెళ్లడం ఖాయమన్న వార్తలు షికార్లు చేశాయి. అంతలోనే ఆయన చిన్న కొడుకు అర్వింద్ ప్రధాని నరేంద్ర మోడీని పొగుడుతూ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి యాడ్స్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇక డిఎస్ చూపు బిజెపి వైపే అని తేలిపోయింది.

రానున్న ఎన్నికల్లో డిఎస్ ఇద్దరు కుమారులకు టికెట్లు కావాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. దానికి బిజెపి వైపు నుంచి సానుకూల వాతావరణమే ఉన్నట్లు చెబుతున్నారు. అందుకోసమే ముందుగా చిన్నకొడుకు అర్వింద్ గులాబీ తోట నుంచి కమలం తోటకు పయనమైనట్లు చెబుతున్నారు. టిఆర్ఎస్ 75లక్షలకు పైగా సభ్యత్వం నమోదు చేసి రికార్డు నెలకొల్పిన నేపథ్యంలో డిఎస్ ఇద్దరు కొడుకులు టిఆర్ఎస్ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయించుకోకపోవడం కూడా పార్టీ మారడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూరుస్తున్నది.
