Asianet News TeluguAsianet News Telugu

నల్లగొండ అసెంబ్లీ బరిలో బొడ్డుపల్లి లక్ష్మి

  • అధిష్టానం దృష్టిలో లక్ష్మి పేరు పరిశీలన
  • కోమటిరెడ్డి ఎంపి కామెంట్స్ పై జోరుగా ప్రచారం
  •  
is boddupally laxmi contest 2019 nalgonda assembly elections

కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిసేపటి క్రితమే నల్లగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. తాను రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకి కాకుండా పార్లమెంటుకు పోటీ చేస్తానని ప్రకటన చేశారు. దీంతో నల్లగొండ స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్నదానిపై చర్చలు జోరందుకున్నాయి.

ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంటుకు పోటీ చేసే పక్షంలో ఆ నల్లగొండ అసెంబ్లీ స్థానానికి ప్రస్తుత మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఉన్న బొడ్డుపల్లి లక్ష్మిని బరిలోకి దింపే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. బిసి సామాజికవర్గానికి చెందిన బొడ్డుపల్లి లక్ష్మికి నల్లగొండ టికెట్ ఇవ్వడం ద్వారా బిసిల ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవచ్చన్న ఉద్దేశం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ఒక యువకుడిని నల్లగొండ బరిలో దింపుతానని కోమటిరెడ్డి ప్రకటించడం కీలకంగా మారింది. లక్ష్మిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి. యువకుడు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొడుకును దింపుతారా అన్నది తేలాల్సి ఉంది.

గత నెలలో మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ ను ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ హత్య వెనుక అధికార టిఆర్ఎస్ పార్టీ నేతల హస్తం ఉన్నట్లు కాంగ్రెస్ బలంగా ఆరోపణలు గుప్పించింది. స్థానిక పోలీసులు కూడా హంతకులతో చేతులు కలిపారని ఆరోపించింది. హత్య విషయంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మీద బలంగా ఆరోపణలు గుప్పించారు. వేముల వీరేశం మనుషులే బొడ్డుపల్లి శ్రీనివాస్ ను హత్య చేశారని కాంగ్రెస్ పెద్ద నేతలు కూడా ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మిని రానున్న ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి బరిలోకి దింపుతారని కొద్దిరోజుల కిందట ప్రచారం జోరుగా సాగింది. సోషల్ మీడియాలో ఒక వార్త దుమ్ము రేగింది.

బొడ్డుపల్లి శ్రీనివాస్ తన సొంత తమ్ముడి లాంటోడని కోమటిరెడ్డి ప్రకటించారు. శ్రీను చనిపోయిన సందర్భంలో తన సొంత కొడుకు చనిపోయినప్పుడు ఎంతగా విలపించారో అంతకంటే ఎక్కువగానే ఏడ్చారు కోమటిరెడ్డి. తనను ఏం చేయలేక తన రైట్ హ్యాండ్ లాంటి శ్రీను పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. ఆ హత్య తదనంతర పరిణామ క్రమంలో నల్లగొండలో లక్ష్మి పోటీ చేస్తారన్న వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తలను కోమటిరెడ్డి ఖండించారు. తాను మునుగోడు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తాను వందకు వంద శాతం నల్లగొండ అసెంబ్లీ స్థానంలోనే పోటీ చేస్తానని ప్రకటించారు. కోమటిరెడ్డి ఆ ప్రకటన చేసిన తర్వాత లక్ష్మి పోటీ చేస్తారన్న వార్తలు ఆగిపోయాయి.

అయితే ఇవాళ కోమటిరెడ్డి నల్లగొండలో మరో కీలక ప్రకటన చేశారు. తాను నల్లగొండ పార్లమెంటుకు పోటీ చేస్తానని పార్లమెంటు పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపిస్తానని ప్రకటించారు. అయితే నల్లగొండ పార్లమెంటుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తే.. ఆయన సోదరుడు ప్రస్తుత ఎమ్మెల్సీ ఎక్కడ పోటీ చేస్తారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి రానున్న ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటుకే పోటీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వెంకటరెడ్డి పార్లమెంటుకు చేస్తే.. అదే కేంద్రంలో సోదరుడు పోటీ చేయడం సమంజసం కాదని చెబుతున్నారు. మరి రాజగోపాల్ కొడుకు పోటీ చేస్తే లక్ష్మి పోటీ చేసే అవకాశం కోల్పోతారు. కానీ.. అధిష్టానం దృష్టిలో మాత్రం బొడ్డుపల్లి లక్ష్మి పేరు పరిశీలనలో ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ లిస్ట్ లో లక్ష్మి పేరు కూడా ఉంది

ఇటీవలకాలంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు సర్కులేట్ అవుతోంది. అందులో 60 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. అందులో నల్లగొండ స్థానానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆబ్లిక్ బొడ్డుపల్లి లక్ష్మి అనే పేరు కూడా ఉంది. అయితే ఆ లిస్టు సరైనదా కదా అన్న విషయం పక్కన పెడితే ఆ జాబితాలో కోమటిరెడ్డి లేదా లక్ష్మి పోటీ చేస్తారన్న విషయాన్ని వెల్లడించారు. మరికొన్ని నియోజవర్గాల్లో ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా నమోదు చేయబడ్డాయి. ఏదేమైనా ఈ లిస్టులో లక్ష్మి పేరు ఉండడం, తాజాగా కోమటిరెడ్డి పార్లమెంటు బరిలోకి దిగుతానని ప్రకటించడం చూస్తే.. 2019 ఎన్నికల్లో బొడ్డుపల్లి లక్ష్మి నల్లగొండ అసెంబ్లీ బరిలో దిగడం ఖాయంగా చెప్పవచ్చంటున్నారు.

is boddupally laxmi contest 2019 nalgonda assembly elections

Follow Us:
Download App:
  • android
  • ios