తెలంగాణలో జరుగుతున్న వ్యాక్సినేషన్  కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. హైదరాబాద్ కోఠి డీఎంఈలో ఐపీఎస్ అధికారి భార్యకు వ్యాక్సిన్ వికటించింది. ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసిం సతీమణి పరిస్ధితి ఆందోళనకరంగా మారింది. దీంతో ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. 

మరోవైపు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకుంది.

రాష్ట్రంలో ఇవాళ్టీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి వాక్సినేషన్ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా 45 ఏళ్లు పైబడినవారు సుమారు 80 లక్షల మంది ఉన్నట్లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఈ విభాగంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌, ఆరోగ్య సమస్యలున్న వారితో సహా 10 లక్షల మందికి తొలి డోస్ ఇచ్చామని శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి ప్రభుత్వ, 250 ప్రైవేట్ కేంద్రాల్లో వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాక్సినేషన్‌ని వేగవంతం చేయాలని కేంద్రం సూచించిందని శ్రీనివాస్ తెలిపారు. ఈ క్రమంలో ప్రతిరోజూ లక్ష మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. గత రెండు వారాలుగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు మంచి స్పందన వస్తోందని శ్రీనివాస్ చెప్పారు.