నిందితుల చేతిలో ఆయుధాలున్నాయా?:సిర్పూర్కర్ కమిషన్ ఎదుట సజ్జనార్ హాజరు
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్ ముందు ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ హాజరయ్యారు. ఎన్ కౌంటర్ గురించి కమిషన్ సభ్యులు అడిగి తెలుసుకొన్నారు. ఈ నెల 7వ తేదీన మరోసారి హాజరు కావాలని సజ్జనార్ ను కమిషన్ ఆదేశింది.
హైదరాబాద్: దిశ (disha accused encounter) నిందితుల ఎన్‌కౌంటర్ పై సుప్రీంకోర్టు (supreme court) ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ (sirpurkar commission)కమిషన్ ముందు ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సోమవారం నాడు హాజరయ్యారు.
దిశ కమిషన్ ముందు గతంలోనే విచారణకు సజ్జనార్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ ఎన్ కౌంటర్ ఘటనకు సంబంధించిన సాక్షుల విచారణను పురస్కరించుకొని సజ్జనార్ ను ఇవాళ రావాలని సిర్పూర్కర్ కమిషన్ ఆదేశించింది. దీంతో కమిషన్ ముందుకు సజ్జనార్ హాజరయ్యారు.
ఎన్ కౌంటర్ జరిగిన తీరు తెన్నుల గురించి కమిషన్ సభ్యులు సజ్జనార్ ను అడిగి తెలుసుకొన్నారు. ఈ నెల 7వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది.సజ్జనార్‌తో పాటు కమిషన్ ముందు క్లూస్ టీం సభ్యులు వెంకన్న కూడా హాజరయ్యారు. ఘటన స్థలంలో దొరికిన ఆధారాలపై క్లూస్ టీం సభ్యుడు వెంకన్న నివేదిక సమర్పించారు.
ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో నిందితుల చేతిలో ఆయుధాలు ఉన్నాయా?, వాటిపై నిందితుల వేలి ముద్రలు సేకరించారా? అని ప్రశ్నించింది. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలానికి వెళ్లి పంచనామా చేసిన రెవెన్యూ అధికారిని కూడా కమిషన్ విచారించింది.
2019 డిసెంబర్ 6వ తేదీన చటాన్ పల్లి వద్ద దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగింది. దిశపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో పోలీసుల నుండి తుపాకులు లాక్కొని కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో తాము జరిపిన కాల్పుల్లో నిందితులు మరణించారని గతంలోనే పోలీసులు ప్రకటించారు. అయితే ఈ ఎన్ కౌంటర్ పై హక్కుల సంఘాల నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సిర్పూర్కర్ కమిషన్ ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.