ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హైదరాబాద్ మాజీ ఉద్యోగులు ఫేక్ డాక్యుమెంట్లతో హోమ్ లోన్స్ ఇష్యూ చేశారని, తద్వార బ్యాంక్‌కు కోట్ల నష్టం చేకూర్చారని సీబీఐ తేల్చింది. వారికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించింది.

హైదరాబాద్: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) హైదరాబాద్ మాజీ ఉద్యోగులకు సీబీఐ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. రుణాల మంజూరులో అక్రమాలకు పాల్పడి బ్యాంకు కోట్ల నష్టం చేసినట్టుగా తేల్చిన సీబీఐ కోర్టు వారికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది.

తప్పుడు ఆదాయ పన్ను పత్రాలతో గృహ రుణాలు మంజూరు చేశారని ఈ అధికారులపై ఆరోపణలు ఉన్నాయి. ఐవోబీ హైదరాబాద్ మాజీ చీఫ్ మేనేజర్ సౌమన్ చక్రవర్తి, మాజీ సీనియర్ మేనేజర్ శంకరన్ పద్మనాభన్‌‌లను సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. వీరికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. ఒక లక్షల జరిమానా విధిస్తూ ఆదేశాలిచ్చింది. అలాగే, టీ సత్య, వెంకట దివాకర్, జూలూరి లక్ష్మయ్యలకు ఐదేళ్ల జైలు శిక్ష. రూ. 75 వేల ఫైన్ విధించింది. సయ్యద్ ముస్తక్ అహ్మద్, బొర్ర చంద్రపాల్, తోట రవీందర్, ఎం గోపాల్ రావు, బసవన్న రవీంద్రలకు మూడేళ్ల జైలుతోపాటు రూ. 75 వేల జరిమానా విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి హోమ్ లోన్స్ ఇచ్చినట్ట వచ్చిన ఆరోపణలతో 2005లో ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్‌పై సీబీఐ కేసు రిజిస్టర్ చేసింది. నకిలీ సేల్ డీడ్‌లను, కాలం చెల్లిన ఎల్ఐసీ పాలసీలతో ఈ లోన్లు మంజూరు చేసినట్టు తేల్చింది. సీబీఐ కోర్టులో 2007లో చార్జి షీటు దాఖలు చేసింది.

2003 నుంచి 2004 వరకు ఈ రుణాలు మంజూరు చేసినట్టు సీబీఐ పేర్కొంది. ఈ ఫేక్ లోన్ల ద్వారా బ్యాంకుకు రూ. 2.21 కోట్ల నష్టం కలిగించినట్టు తేలింది. ఫలితంగా దోషులకు శిక్షలు ఖరారు చేస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది.