హైదరాబాద్: బయో ఆసియా సదస్సులో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు, తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది. తెలంగాణతో పాటు ఇండియాను కూడా ప్రమోట్ చేయాలని పియూష్ గోయల్ కేటీఆర్ కు సూచించారు. అదే చేయాల్సి వస్తే తాము జాతీయ పార్టీని పెట్టాల్సి వస్తుందని కేటీఆర్ అన్నారు.

అది సరే... మరో జాతీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందని పియూష్ గోయల్ అన్నారు. కేటీఆర్ కు మంచి మార్కెటింగ్ నైపుణ్యాలున్నాయని పియూష్ గోయల్ అన్నారు. భారత్ ను కూడా మార్కెటింగ్ చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. దానికి తాను జాతీయ పార్టీ పెడుతానని కేటీఆర్ చమత్కరించారు. 

దేశంలోని ప్రతి ఒక్కరికీ తక్కువ ధరకు ఆరోగ్య సంరక్షణ అందించడం ప్రభుత్వ లక్ష్యమని పూయిష్ గోయల్ అన్నారు. ధరల నియంత్రణ సానుకూల ప్రభావాన్ని చూపిందని, ధరల నియంత్రణ ప్రజలకు మంచి చేస్తుందని ఆయన అన్నారు. గతంలో వైద్య సేవలు పొందలేని వాళ్లు కూడా వాటిని పొందాలని ఆయన అన్నారు. స్టంట్లు, నీ ఇంప్లాంటేషన్ ధరల తగ్గింపు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆయన చెప్పారు. 

సరఫరా చెయిన్ కారణంగా పలు వైద్య పరికరాల వ్యయం మూడు రెట్లు అధికంగా ఉందని పియూష్ గోయల్ చెప్పారు. బయో ఏషియా 2020లో భాగంగా జరిగిన సీఈవోల కాంక్లేవ్ లో పాల్గొని ఆయన ప్రసంగించారు. దానికి తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీ రామారావు మోడరేటర్ గా వ్యవహరించారు. 

కేటీఆర్ అడిగిన ప్రశ్నకు గోయల్ సమాధానమిస్తూ... దేశంలో 130 కోట్ల జనాభాకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని పియూష్ గోయల్ అన్నారు.