సిద్దిపేట: యావత్ ప్రపంచాన్ని వ్యాధులు వణికిస్తూ మానవ మనుగడకు సవాల్ విసురుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోగాల కల్లోలాలను ఎదుర్కోవడానికి యోగా అద్భుత అవకాశమని... కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని సూచించారు. ప్రతీ రోజు యోగా సాధన చేస్తే రోగాలను నిలువరించవచ్చని... తాను ప్రతీ రోజూ యోగా సాధన చేస్తానని హరీష్ వెల్లడించారు. 

ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ముందుగానే ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్ధిపేట జిల్లాలో యోగాను గతేడాది నుంచి అన్ని వర్గాల ప్రజల్లో, పాఠశాలల్లో క్రియాశీలకంగా ప్రవేశపెట్టి మంచి సత్ఫలితాలను సాధిస్తున్నామని వెల్లడించారు. 

read more   తెలంగాణలో కరోనా విశ్వరూపం... శనివారం ఒక్కరోజే 546 కేసులు

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో యోగా సాధన చేయాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. దీని వల్ల రోగ నిరోధక శక్తి తప్పక పెరుగుతుందని, ఎలాంటి వ్యాధులైనా ఎదుర్కొనే శక్తి లభిస్తుందన్నారు. ఏలాంటి ఖర్చు లేకుండా ఉన్న యోగాను అందరూ సాధన చేసి ఆరోగ్య తెలంగాణను నిర్మించాలని ప్రజలను కోరారు. 

''మిమ్మల్ని అందరినీ యోగా సాధనకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అందరం కలిసి యోగా చేద్దాం.. ఆరోగ్య తెలంగాణగా మార్చుదాం'' అని మంత్రి హరీశ్ ప్రజలకు పిలుపు నిచ్చారు.