వరంగల్: ఇంటర్  సప్లిమెంటరీ ప్రశ్నపత్రాలు అదృశ్యమయ్యాయి. పోలీస్‌స్టేషన్‌ నుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ప్రశ్నపత్రాలు మాయం కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈ నెల 7వ తేదీ నుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణ కోసం అవసరమైన ప్రశ్నపత్రాలను ఇంటర్ బోర్డు ఆయా పోలీస్ స్టేషన్లలో భద్రపర్చింది.

ఈ నెల 9,10 తేదీల్లో నిర్వహించే పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను వరంగల్ మిల్స్ కాలనీలోని పోలీస్ స్టేషన్‌లో భద్రపర్చారు. అయితే ఇంటర్ ప్రశ్నపత్రాలు మిస్సయ్యాయి. 

పోలీస్‌స్టేషన్‌లోని ఒకే గదిలో పదో తరగతి, ఇంటర్ ప్రశ్నపత్రాలను భద్రపర్చారు. సుమారు 13 బాక్సులు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. అయితే ఒకే గదిలో టెన్త్, ఇంటర్ ప్రశ్న పత్రాల బాక్సులను భద్రపర్చడం వల్ల ఇబ్బంది జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఇంటర్ ప్రశ్నపత్రాలు మిస్ కావడంపై ఆర్ఐఓ లింగయ్య ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. మరో వైపు ఇదే విషయమై ఆయన వరంగల్ పోలీస్ కమిషనర్‌కు కూడ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఇదే జిల్లాలో ఇంటర్ ప్రశ్నపత్రం లీకైందనే ప్రచారం కూడ సాగుతోంది. ఈ ఘటనలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంటర్ ఫలితాల్లో చోటు చేసుకొన్న అవకతవకల కారణంగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే.