శ్రీ చైతన్య కాలేజ్ నార్సింగి బ్రాంచ్‌లో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న పోలీసులు.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను వెల్లడించారు.
శ్రీ చైతన్య కాలేజ్ నార్సింగి బ్రాంచ్‌లో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న పోలీసులు.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను వెల్లడించారు. కాలేజ్ యాజమాన్యం వేధింపుల వల్లే సాత్విక్ మరణించాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. కాలేజీ సిబ్బంది వేధింపుల వల్లే సాత్విక్ బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలిపారు. పదే పదే బూతులు తిట్టడం వల్లే సాత్విక్ మనస్తాపం చెందాడని పేర్కొన్నారు. కాలేజ్ సిబ్బంది విద్యార్థుల ముందు పదే పదే సాత్విక్‌ను కొట్టారని తెలిపారు.
ఆచార్య తో పాటు ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తరచుగా తిట్టడంతోనే సాత్విక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. చనిపోయే రోజు పేరెంట్స్ వచ్చి వెళ్ళగానే స్టడీ అవర్‌లో సాత్విక్‌ను ఆచార్య, కృష్ణారెడ్డి చితకబాదారని తెలిపారు. హాస్టల్ వార్డెన్ నుంచి కూడా సాత్విక్ వేధింపులు ఎదుర్కొన్నట్టుగా చెప్పారు.
ఇక, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాజప్రసాద్, అలివేలు దంపతు చిన్న కుమారుడు సాత్విక్.. నార్సింగ్ శ్రీచైతన్య కాలేజ్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. మంగళవారం కాలేజ్ హాస్టల్‌లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సాత్విక్ ఆత్మహత్య చేసుకోవడానికి.. కాలేజ్ లెక్చరర్లు వేధింపులే కారణమని సాత్విక్ తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు చెబుతున్నారు. మార్కులు తక్కువగా వస్తున్నాయని లెక్చరర్లు వేధించినట్టుగా సాత్విక్ తమతో చెప్పుకుని బాధపడినట్టుగా అతడి తల్లిదండ్రులు తెలిపారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే సాత్విక్ కుటుంబ సభ్యులు, ఇతర విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సాత్విక్ రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ఆచార్య, వార్డెన్ నరేష్, టీచర్ శోభన్ నరకం చూపిస్తున్నారని అందులో రాసి ఉంది. వారి టార్చర్ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సాత్విక్ తెలిపాడు. తన ఆత్మహత్యకు కారకులైన వారిపై యాక్షన్ తీసుకోవాలని కోరాడు. అమ్మ, నాన్న, అన్నయ్య ఈ పని చేస్తున్నందుకు క్షమించండని పేర్కొన్నాడు. ఇక, ఈ ఘటనపై సాత్విక్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన మరణానికి కారణమంటూ సాత్విక్ సూసైడ్ నోట్‌లో ప్రస్తావించిన లెక్చరర్ ఆచార్య, వార్డెన్ నరేష్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
