ఆమెకు అమ్మ, నాన్న లేరు. ఒంటరిగా ఉంటూనే ఇంటర్ చదువుతోంది. ఆమెకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కానీ పెద్దగా పట్టించుకోడు.  దీంతో తనకు ఏదైనా కష్టం వస్తే... తాను చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేరు. ఈ క్రమంలోనే కొందరు పోకిరీలు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఇవన్నీ తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Also Read హైద్రాబాద్‌లో ప్రహరీగోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి..

పూర్తి వివరాల్లోకి వెళితే... సూరారాం డివిజన్ నెహ్రూ నగర్ కి చెందిన తులసి(17)  చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో అమ్మమ్మ కోమలిబాయి వద్ద ఉంటూ సమీపంలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. గత కొంతకాలంగా ఆమెకు నెహ్రూ నగర్ కి చెందిన ఓ యువకుడిని ప్రేమిస్తోంది.  ఇంటర్ పరీక్షలు దగ్గరపడుతుండటంతో... ఆమె చదువు డిస్టర్బ్ కాకూడదని ప్రియుడు మాట్లాడటం మానేశాడు.

కాగా.. తులసి కాలేజీకి వెళ్తుండగా.. తిరిగి వస్తుండగా ఆమెను కొందరు  పోకిరీలు వేధించడం మొదలుపెట్టారు. వారి వేధింపుల విషయం ఎవరికి చెప్పుకోవాలో కూడా ఆమెకు అర్థం కాలేదు. దీంతో... తాను ఒంటరిని అయ్యాననే బాధ పెంచుకుంది. ఈ క్రమంలో మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారని.. కాకపోతే వారికి తన బాధలన్నీ చెప్పి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదంటూ ఆమె  సూసైడ్ నోట్ లో పేర్కొనడం గమనార్హం. బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.