Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాలలో విషాదం... బావిలో దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థిని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

inter student commit suicide in jagtial
Author
Jagtial, First Published Jun 29, 2022, 12:53 PM IST

జగిత్యాల : మంగళవారం తెలంగాణలో వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలు కొన్ని కుటుంబాల్లో ఆనందాన్ని, మరికొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఫలితాలు చూసుకుని మార్కులు తక్కువగా వచ్చివారు, ఫెయిల్ అయినవారు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా జగిత్యాల జిల్లాకు చెందిన బాలిక కూడా మనస్థాపంతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన యాగండ్ల నిరోషా (17) దొంతాపూర్ లో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇటీవలే యువతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయగా మంగళవారం ఫలితాలు వెలువడ్డాయి. రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో నిరోష తీవ్ర మనస్థానికి గురయి దారుణ నిర్ణయం తీసుకుంది.  

మంగళవారం సాయంత్రం ఇంట్లోంచి బయటకు వెళ్లిన నిరోషా రాత్రి అవుతున్నా తిరిగిరాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు గ్రామమంతా వెతికారు. ఈ క్రమంలోనే గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో బాలిక దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. అదే రాత్రి బావిలోకి దిగి యువతి మృతదేహాన్ని బయటకు తీసారు. యువతి మృతదేహాన్ని పట్టుకుని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు రోదిస్తున్న తీరు చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది.  

మృతురాలి కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.  పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. 

Also Read ఇంటర్ విద్యార్థుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.. ఆ ఫీజులను మినహాయించాలి: రేవంత్ రెడ్డి

ఇక నిన్న వెలువడిన ఫలితాల్లో పాసయినప్పటికి హైదరాబాద్ కు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చింతల్ బస్తీకి చెందిన ఇంటర్ విద్యార్ధి గౌతమ్ కుమార్ ఇంటర్ లో మంచిమార్కులు వస్తాయని ఆశించాడు. కానీ అనుకున్నదానికంటే మార్కులు తక్కువగా రావడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన గౌతమ్ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

హైదరాబాద్ శివారులోని కాటెదాన్ లో మరో ఇంటర్మీడియట్ విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపం చెందిన విద్యార్ధి బిల్డింగ్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఇంటర్ పలితాలు వెలువడిన తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. 

ఇదిలావుంటే మంగళవారం వెలువడిన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయిగా నిలిచింది. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.  

ఫలితా విడుదల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండియర్‌లో 67. 82 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టుగా చెప్పారు. ఇంటర్ ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో, హన్మకొండ సెకండ్ ప్లేస్‌లో నిలిచాయని వెల్లడించారు. ఈ నెల 30 నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్టుగా చెప్పారు. ఆగస్టు ఒకటి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు  నిర్వహించనున్నట్టుగా తెలిపారు. ఆగస్టు చివరినాటికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)

Follow Us:
Download App:
  • android
  • ios